PIL On AP Endowment Tribunal Chairman: రాష్ట్ర దేవాదాయ ట్రైబ్యునల్ ఛైర్మన్‌గా విశ్రాంత న్యాయాధికారి కె.వెంకటలక్ష్మి హరినాథ్ నియామకాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలైంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర, జస్టిస్ సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి, విశ్రాంత న్యాయాధికారి కె.వి.ఎల్.హరినాథ్‌కు నోటీసులు జారీచేసింది. విచారణను ఈనెల 24 కు వాయిదా వేసింది. దేవాదాయ ట్రైబ్యునల్ ఛైర్మన్‌గా విశ్రాంత న్యాయాధికారి కె.వి.ఎల్ హరినాథ్‌ను నియమిస్తూ గతేడాది మార్చి 31న రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవో 201ను సవాలు చేస్తూ న్యాయవాది టి. బోసుబాబు హైకోర్టులో పిల్ వేశారు.
దీనిపై న్యాయవాది సార్వభౌమారావు వాదనలు వినిపిస్తూ.. హైకోర్టు పరిపాలనపరమైన సిఫారసులతో న్యాయాధికారి హరినాథ్ తప్పనిసరి పదవీ విరమణ చేశారన్నారు. తర్వాత ప్రభుత్వం ఆయన్ను ట్రైబ్యునల్ ఛైర్మన్‌గా నియమించిందన్నారు. తప్పనిసరి పదవీ విరమణ చేయించిన వ్యక్తిని ఛైర్మన్‌గా నియమించడం చట్ట విరుద్ధం అన్నారు. హైకోర్టు సింగిల్ జడ్జి ఓ వ్యాజ్యంలో నిర్ణయం వెల్లడిస్తూ తప్పనిసరి పదవీ విరమణ చేసినా.. విశ్రాంత న్యాయాధికారి హరినాథ్ వివిధ పోస్టుల్లో నియమితులయ్యేందుకు అడ్డంకి కాదని పేర్కొన్నారన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం నియామకానికి ఉత్తర్వులిచ్చిందన్నారు.