తెలియకుండానే ఇంధన ధరలు పెరుగుతున్నాయి. వినియోగదారులు లీటరుకు చెల్లించే మొత్తంలో రెండొంతుల సొమ్ము (సుమారు రూ.60పైగా) పన్నుల రూపంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఖజానాకే జమవుతోంది. అంతర్జాతీయ విపణిలో ముడిచమురు ధరలు తగ్గినప్పుడు ఎక్సైజ్, ఇతర పన్నులు పెంచడం.. ముడిచమురు ధరలు పెరిగినప్పుడు పన్నులు తగ్గించకపోవడంతో వినియోగదారులపై భారం పడుతోంది.
నవంబరు రెండో వారం నుంచి..
గతేడాది నవంబరు రెండో వారం నుంచి పెట్రో ధరల పెరుగుదల కొనసాగుతూనే ఉంది. అప్పట్లో లీటరుకు రూ.87 వరకున్న పెట్రోలు ధర.. క్రమంగా పెరుగుతూ రూ.92కి పైగా చేరింది. డీజిల్ ధరలు కూడా రూ.77 నుంచి రూ.85కి పైగా చేరాయి. లీటరు పెట్రోలుపై రూ.5, డీజిల్‌పై రూ.8కి పైగా పెరిగాయి.
- శనివారం చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలో అత్యధికంగా లీటరు పెట్రోలు రూ.93.82, డీజిల్ రూ.86.74 చొప్పున ఉంది. గుంటూరు జిల్లా మాచర్ల, అనంతపురం జిల్లా అగలి, శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం తదితర ప్రాంతాల్లోనూ పెట్రోలు రూ.93కి చేరువలో ఉంది.
మూల ధర రూ.30 అయితే.. పన్నులతో రూ.62 అదనం
ఉదాహరణకు పెట్రోలు మూలధర లీటరుకు రూ.30 చొప్పున ఉంటే దానికి కేంద్ర ఎక్సైజ్ పన్ను రూ.33పైగా కలుస్తోంది. అంటే లీటరుకు రూ.63పైగా అవుతోంది. దీనికి డీలరు కమీషన్ రూపంలో రూ.3.50 కలిపితే రూ.66.50కి చేరుతోంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వ వ్యాట్, అదనపు వ్యాట్, రహదారి పన్నులను కలిపితే లీటరు రూ.26 వరకు పెరుగుతోంది. మొత్తంగా కలిస్తే లీటరు పెట్రోలు రూ.92 వరకు అవుతోంది. డీజిల్‌పైనా కేంద్ర ఎక్సైజ్ పన్ను లీటరుకు రూ.32 పైగా ఉండగా, డీలర్ కమీషన్ రూ.2.53 కలిపితే రూ.65 వరకు అవుతుంది. దీనికి రూ.20 వరకు రాష్ట్ర పన్నులు తోడవుతున్నాయి.