ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్ (ఏపీఎస్‌డీసీ).. రుణం పొందే హోదా కల్పిస్తున్న ఏపీ రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్ చట్టం-2020లోని సెక్షన్ 3(3), 4ను రద్దు చేయాలంటూ.. విజయవాడకు చెందిన కె.హిమబిందు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ విషయంలో రాష్ట్ర ఆర్థికశాఖ వివిధ సందర్భాల్లో ఇచ్చిన జీవోలను రద్దు చేయాలని కోరారు. అదనపు రిటైల్ ఎక్సైజ్ పన్ను రూపంలో ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని.. ఎస్క్రో ఖాతా నుంచి బ్యాంకులకు బదలాయించకుండా నిలువరించాలని అభ్యర్థించారు.
నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీగా ఆర్‌బీఐ చట్టం ప్రకారం ‘సర్టిఫికెట్ ఆఫ్ రిజిస్ట్రేషన్’ పొందాల్సిన అవసరం ఏపీఎస్‌డీసీకి ఉందని, ఆ సర్టిఫికెట్ పొందకపోవడం ఆర్‌బీఐ చట్టం సెక్షన్ 45 IA(1)(A)ను ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. కనీసం 2 కోట్ల సొంత నిధులు లేకుండా ఏపీఎస్‌డీసీ వ్యవహారాలు నిర్వహిస్తోందని చెప్పారు. ఆ విధానం సెక్షన్ 45 IA(1)(B)కి విరుద్ధమన్నారు. కేంద్రం నిర్ణయించిన పరిమితిని దాటి అదనంగా రుణం పొందాలంటే.. అధికరణ 293(3) ప్రకారం కేంద్ర ప్రభుత్వ సమ్మతి అవసరమని గుర్తుచేశారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం అలా అనుమతి తీసుకోలేదని పిటిషన్‌లో తెలిపారు. సంక్షేమ పథకాల అమలు కోసం ఏపీఎస్‌డీసీ 24 వేల 500 కోట్ల రుణం పొందేందుకు అనుమతిస్తే.. కేంద్రం విధించిన రుణ పరిమితిని ఉల్లంఘించడమే అవుతుందని చెప్పారు. ప్రభుత్వం వేలం వేయడానికి ప్రతిపాదించిన కొన్ని ప్రభుత్వ ఆస్తులను తనఖా కోసం ఏపీఎస్‌డీసీకి రాష్ట్ర ప్రభుత్వం బదలాయించడం.. 2012లో తీసుకొచ్చిన భూకేటాయింపు విధాన నిబంధనలకు విరుద్ధమన్నారు. Spot
ప్రతివాదులుగా బ్యాంక్ అధికారులు..
ఈ వ్యాజ్యంలో కేంద్ర ఆర్థిక వ్యవహారాలశాఖ కార్యదర్శి, రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి, ఏపీఎస్‌డీసీ వైస్‌ఛైర్మన్ అండ్ ఎండీ, విశాఖ జిల్లా కలెక్టర్, విజయవాడ ఎస్‌బీఐ కమర్షియల్ బ్రాంచ్ ఏజీఎం అండ్ ఆర్‌ఎం-1, హైదరాబాద్‌లోని పీఎన్‌బీ డిప్యూటీ జనరల్ మేనేజర్, ఇండియన్ బ్యాంక్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్, యూబీఐ ఏజీఎం, బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ మేనేజర్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర తుళ్లూరు బ్రాంచ్ మేనేజర్, ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్ ఏజీఎం, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ చీఫ్ మేనేజర్, ఎస్‌బీఐ క్యాప్ ట్రస్టీ కో-లిమిటెడ్ ఎండీ అండ్ సీఈవో, ఆర్‌బీఐ హైదరాబాద్ ప్రాంతీయ సంచాలకులు, కాగ్ ఆడిట్ విభాగం ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్, రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్-విజయవాడను వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏ.కే.గోస్వామి, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం.. సోమవారం ఈ వ్యాజ్యంపై విచారణ జరపనుంది.