సీఎం జగన్ 22 నెలల పాలనకు తిరుపతి ఉప ఎన్నిక రెఫరెండంగా భావిస్తున్నామని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. తిరుపతి ఉప ఎన్నికల్లో తెదేపా, భాజపా పార్టీలకు జెండాలు తప్పితే ఎజెండా లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, భాజపా నేతలు తిరుపతి ఉప ఎన్నికల్లో విష ప్రచారం చేస్తూ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. తెదేపా 5 ఏళ్ల పాలనలో, భాజపా 7 ఏళ్ల పాలనలో రాష్ట్రానికి ఏం ఒరగబెట్టారని ప్రశ్నించారు. వాటికి సమాధానం చెబుతూ..,ఈ ఎన్నికను రెఫరెండంగా అంగీకరిస్తారా? అని సవాల్ చేశారు.
భాజపా నేత సునీల్ దేవధర్ నామాలు పెట్టుకుని రాష్ట్రానికి పంగనామాలు పెడుతున్నారని ఆక్షేపించారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా ప్రజల ఆరోగ్యం కోసం సీఎం తిరుపతి సభకు రాకపోతే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. సామాజిక బాధ్యత లేకుండా మనుషులను ఇతర ప్రాంతాల నుంచి తెచ్చి తెదేపా ప్రచారం చేసుకుంటోందని విమర్శించారు.