ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

diesel prices : నడ్డివిరుస్తున్న ఇంధన ధరలు...సామాన్యుల జేబుకూ చిల్లు - people problems with diesel prices

నింగినంటుతున్న ఇంధన ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. డీజిల్‌ రేటు రోజురోజుకూ పెరుగుతుండటంతో అప్పు చేసి ఆటోలు, కార్లు, వ్యాన్లు కొని నడిపే యజమానులు, డ్రైవర్లు అల్లాడుతున్నారు. వాహనం నిర్వహణకు, నెలవారీ కిస్తీలు చెల్లించేందుకూ మిగలడం లేదని యజమానులు పేర్కొంటున్నారు. ఆటోవాలాలదీ అదే పరిస్థితి. పాత ఛార్జీలతోనే నడుపుతుండటంతో గిట్టుబాటు కావడం లేదని వారు వాపోతున్నారు.

నడ్డివిరుస్తున్న ఇంధన ధరలు
నడ్డివిరుస్తున్న ఇంధన ధరలు

By

Published : Oct 25, 2021, 3:54 AM IST

నింగినంటుతున్న ఇంధన ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. డీజిల్‌ రేటు రోజురోజుకూ పెరుగుతుండటంతో అప్పు చేసి ఆటోలు, కార్లు, వ్యాన్లు కొని నడిపే యజమానులు, డ్రైవర్లు అల్లాడుతున్నారు. తాజాగా ఆదివారం పెట్రోల్‌ ధర మరో 36 పైసలు పెరిగి లీటరుకు రూ.111.91కు, డీజిల్‌పై 38 పైసలు పెరిగి రూ.106కు చేరింది. గత ఏడాది కాలంలో లీటరుపై సుమారు రూ.34 పెరగడంతో సామాన్యుల నడ్డి విరుగుతోంది. నిత్యావసరాల ధరలపైనా ప్రభావం చూపుతోంది. దేశంలో పంటలు ఇబ్బడిముబ్బడిగా పండినా వాటి ధరలు ఆకాశాన్నంటడానికి ప్రధానంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలే కారణమని టోకు వ్యాపారులు పలువురు ‘ఈనాడు’కు తెలిపారు. పలు రంగాలపై డీజిల్‌, పెట్రోల్‌ ధరలు ప్రభావం చూపుతుండటంతో ప్రజలపై అనేక రకాలుగా ఆర్థిక భారం పడుతోంది. నిత్యావసరాలు మొదలుకుని స్కూల్‌ బస్సు రుసుముల దాకా అన్నీ పెరుగుతుండటంతో పేద, మధ్యతరగతి కుటుంబాల జేబుకు చిల్లు పడుతోంది. ఇంధనం ధరలు ప్రతిరోజూ పెరుగుతుండటంతో నిత్యావసరాల ధరలూ అదేస్థాయిలో అధికమవుతున్నాయి. లారీలు, వ్యాన్లు, ఆటోల కిరాయిల రూపంలో వచ్చిన సొమ్ము డ్రైవర్‌, క్లీనర్‌ల జీతాలకే సరిపోతోందని.. వాహనం నిర్వహణకు, నెలవారీ కిస్తీలు చెల్లించేందుకూ మిగలడం లేదని యజమానులు పేర్కొంటున్నారు. ఆటోవాలాలదీ అదే పరిస్థితి. పాత ఛార్జీలతోనే నడుపుతుండటంతో గిట్టుబాటు కావడం లేదని వారు వాపోతున్నారు.

*వాహనదారులు, డ్రైవర్లకే కాదు.. వినియోగదారులకూ ధరల

మంట తప్పడంలేదు. తెలుగు రాష్ట్రాలకు రోజూ ఇతర రాష్ట్రాల నుంచి వాహనాల్లో వచ్చే నిత్యావసరాలు, ఇతర సరకుల ధరలు మండిపోతున్నాయి. టమాటాలను హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో కిలో రూ.50కి అమ్ముతున్నారు. ఇవి నిత్యం ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి వస్తుంటాయి.

* వ్యవసాయంలో అనేక పనులకు వాహనాలు, యంత్రాలు వాడుతున్నందున రైతులపై ఆర్థిక భారం పడుతోంది. డీజిల్‌ ధరలు పెరుగుతున్నంత వేగంగా తాము అమ్ముతున్న పంటల ధరలు ఎందుకు పెరగడం లేదని రైతులు ప్రశ్నిస్తున్నారు.

కిరాయి పెంచితే ఒప్పుకోవడం లేదు

- గంగిరెడ్డి, లారీ యజమాని, రావులపాలెం, తూర్పుగోదావరి

గత ఏడాది వరకు రావులపాలెం నుంచి కాకినాడకు ఇసుక లోడు తీసుకెళ్లే లారీ కిరాయి రూ.10,000-11,000 ఉండేది. డీజిల్‌కు రూ.3,500-4,000 ఖర్చయ్యేది. ఇప్పుడు డీజిల్‌కు రూ.5,500-6,000 అవుతోంది. అసలే గతంలో కన్నా ఇసుక ధర పెరిగింది. లారీ కిరాయి రూ.1-2వేలు ఎక్కువ అడిగితే ఒప్పుకోవడం లేదు. లారీలను ఖాళీగా ఉంచలేక.. గిట్టుబాటు కాకపోయినా నడపాల్సి వస్తోంది.

స్కూల్‌ బస్సు ఫీజు ఇంకా పెంచుతామంటున్నారు

- కె.శ్రీధర్‌, పోరంకి, విజయవాడ

మా అమ్మాయి, అబ్బాయి మొగల్రాజపురంలోని ఓ పాఠశాలలో చదువుతున్నారు. గత ఏడాది స్కూల్‌ బస్సు రుసుము ఒక్కొక్కరికీ రూ.12 వేలు ఉండేది. ఈసారి రూ.16 వేలకు పెంచారు. డీజిల్‌ ధర ఇంకా పెరిగితే.. రవాణా ఫీజు మరికొంత పెంచుతామని పాఠశాల యాజమాన్యం చెబుతోంది. ఇంధన ధరలు పెరుగుతూపోతే సామాన్య, మధ్యతరగతి కుటుంబాలవారు ఎలా బతకాలి?

రోజుకు రూ.100 కూడా మిగలడం లేదు

- షేక్‌ షఫీ, ఆటో డ్రైవర్‌, విజయవాడ

విజయవాడ శివారులోని పులిపాక నుంచి కాళేశ్వరరావు మార్కెట్‌కు గతంలో డీజిల్‌ ధర లీటరుకు రూ.65-70 ఉన్నపుడు ఒక్కొక్క ప్రయాణికుడు రూ.20 ఇచ్చేవారు. ఇప్పుడు డీజిల్‌ ధర రూ.106 అయింది. ఛార్జీని రూ.30కి పెంచితే ఆటో ఎక్కేందుకు ముందుకు రావడం లేదు. బస్సులో వెళ్తామంటున్నారు. గతంలో రోజుకు ఆటో అద్దె రూ.300, డీజిల్‌ ఖర్చు పోనూ రూ.300-400 వరకు మిగిలేది. ఇప్పుడు రూ.100 కూడా మిగలడం లేదు.

ఇవీచదవండి.

ABOUT THE AUTHOR

...view details