Tax Problems: వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎడాపెడా పన్నులు వేస్తూ ప్రజలకు ఊపిరాడకుండా చేస్తోంది. ఆదాయాన్ని పెంచుకునేందుకు ఇప్పటికే పలు రకాల పన్నుల శాతాన్ని పెంచేసింది. ఇప్పుడు కొత్తగా నాలా పన్నుల పేరుతో లక్షల రూపాయలు కట్టాలంటూ ఇళ్లకు నోటీసులు పంపిస్తోంది. 2006 తర్వాత భూమార్పిడి జరిగి ఇళ్లు నిర్మించుకున్న వారు.. నాలా పన్ను కట్టాలని ప్రభుత్వం చెబుతోంది. రాష్ట్రంలో 30 వేల మందికి చెందిన 25 వేల ఎకరాలను భూమార్పిడి చేసినట్లు ఇప్పటికే గుర్తించిన రెవెన్యూ అధికారులు.. పన్నులు కట్టాలని నోటీసులు జారీ చేశారు. ఇందులో 5 శాతం నాలా పన్ను కాగా, మరో 5 శాతం జరిమానా విధిస్తున్నారు.
నాలా పన్ను చెల్లించాలంటూ కృష్ణా జిల్లా రామవరప్పాడు పంచాయతీ, హనుమాన్ నగర్‌లో వందల మందికి పంచాయతీ అధికారులు నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న వారిలో అత్యధికులు పేద ప్రజలే. పదేళ్ల ముందు కట్టుకున్న ఇళ్లకు ఇప్పుడు నాలా పన్ను చెల్లించమనడం ఏంటని నోటీసులు తీసుకున్న వారు ప్రశ్నిస్తున్నారు. అక్రమంగా ఇళ్లు నిర్మించుకున్నారంటూ అదనపు రుసుము చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారని వాపోతున్నారు. రోజుకూలీ చేసుకుని జీవనం సాగించే తాము.. లక్షల రూపాయలు ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలో తెలియడం లేదంటున్నారు. అప్పట్లో భూమి కొన్న ధర కంటే.. ఇప్పుడు ప్రభుత్వం విధించిన పన్నే ఎక్కువగా ఉందని ఆవేదన చెందుతున్నారు.