రాష్ట్రంలో రాయలసీమ జిల్లాల్లోని శివారు గ్రామాల్లో ఉన్న వలస కార్మికులు పనులకు ఎక్కువగా బెంగళూరు, చెన్నైకి వెళుతుంటారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి వలస కార్మికులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. వీరు ఒడిశాతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు పొట్ట చేతపట్టుకుని కుటుంబంతో సహా వెళుతున్నారు. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో వ్యవసాయ కోతలు, ఇతరత్రా పనులకు వెళ్లి రెండు, మూడు నెలలకు ఒకసారి తిరిగి స్వగ్రామాలకు వస్తుంటారు. గతంలో రెండు, మూడు నెలలకు కలిపి పింఛను తీసుకునే వెసులుబాటు ఉండటంతో వీలుకలిగినప్పుడు వచ్చి పింఛను తీసుకునేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. కొంతమంది వృద్ధులు దూర ప్రాంతాల్లో బిడ్డల చెంత ఉంటున్నారు. పింఛను కోసం వారు ప్రతి నెలా రావాల్సి ఉంది.
స్వగ్రామాలకు రాలేక, అక్కడే ఉండలేక...
అలాంటి వారు.. వచ్చినా పింఛను మొత్తంలో సగం ఛార్జీలకే వెచ్చించాల్సిన పరిస్థితి. వారి వెంట జతగా మరొకరు వస్తే రాకపోకలకే సరిపోతుంది. అలాగని వరుసగా మూడు నెలల తీసుకోకపోతే రద్దవుతోంది. స్వగ్రామాలకు రాలేక, అక్కడే ఉండలేక దూర ప్రాంతాల్లో ఉన్న లబ్ధిదారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే పండుగలకు తమ బిడ్డల దగ్గరకు వెళ్లి కొంత కాలం వారి వద్దే ఉండాలనే ఆలోచన ఉన్నవారూ ఇబ్బందులు పడుతున్నారు. కరోనా నేపథ్యంలో ప్రయాణాలకు భయపడి స్వగ్రామాలకు వెళ్లలేని వారూ ఉన్నారు. వాలంటీర్లు ఫోన్ చేసి సమాచారమిచ్చినా.. తాము వచ్చే పరిస్థితి లేదని లబ్ధిదారులు చెబుతున్నారు.