తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. వర్షం ధాటికీ తాండూర్లోని కాగ్నా నది వంతెన తెగిపోయింది. దీనివల్ల మహబూబ్నగర్ - తాండూర్ మార్గంలో రాకపోకలు స్తంభించిపోయాయి. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ఐదేళ్లలో ఇలా వంతెన తెగిపోవడం ఇది రెండోసారి.
2016లో కురిసిన వర్షాలకు కాగ్నా నది వంతెన తెగిపోయింది. ఆ వంతెనకు తాత్కాలికంగా మరమ్మతులు చేశారు. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం కోటి రూపాయల నిధులను మంజూరు చేసింది. పాత వంతెన పక్కనే కొత్త వంతెన నిర్మాణం చేపట్టింది. కొత్త వంతెన నిర్మాణం పూర్తి కాకపోవడం వల్ల పాత వంతెన మీద నుంచే గత ఐదేళ్లుగా రాకపోకలు కొనసాగాయి. మళ్లీ భారీ వర్షాలకు పాత వంతెన మరోసారి కొట్టుకుపోయింది. దీనితో కథ మొదటికి వచ్చింది.