Polavaram: పోలవరం ప్రాజెక్టు కుడివైపు చేపట్టిన అనుబంధ పనులను వాటర్ ప్లానింగ్, ప్రాజెక్టు నిర్వహణ కమిటీ సభ్యుడు కె.వోరా నేతృత్వంలోని నిపుణుల బృందం ఆదివారం పరిశీలించింది. రెండోరోజు పర్యటనను దేవరగొంది సమీపంలో నిర్మించిన పి.రెగ్యులేటర్ నుంచి వారు ప్రారంభించారు. ఈశాడిల్ డ్యాం, దేవరగొంది, మామిడిగొంది కొండల మధ్య జంట సొరంగాలను పరిశీలించారు.
తోటగొంది సమీపంలో నిర్మించిన బండ్-1, 2ను సందర్శించాక ఆఫ్‌టెక్ రెగ్యులేటర్‌పై నుంచి కుడి కాలువను చూశారు. జలవనరుల శాఖ ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి, ప్రాజెక్టు ఎస్‌ఈ కె.నరసింహమూర్తితో మాట్లాడారు. అక్కడి నుంచి బయలుదేరి గోపాలపురం మండలంలోని 14వ కిలోమీటరు వరకు కుడి కాలువను పరిశీలించి తిరిగి ప్రాజెక్టు క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు.