ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అభివృద్ధి సంస్థ.. బ్యాంక్ రుణాలు పొందిందా లేదా అనే వివరాలు తెలపాలని ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి రావత్‌కు ప్రజా పద్దుల(PAC) కమిటీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ లేఖ రాశారు. ఆర్ధిక శాఖ.. పీఏసీకి వివరాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందన్న ఆర్ధిక మంత్రి బుగ్గన వ్యాఖ్యలను.. ఈ మేరకు పయ్యావుల రాసిన లేఖలో ప్రస్తావించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అభివృద్ధి సంస్థ రుణాలు పొందితే ప్రభుత్వం ఇచ్చిన గ్యారెంటీలు ఏంటో తెలపాలని లేఖలో కోరారు. రుణ ఒప్పంద వివరాలు తెలపాలన్నారు. రాష్ట్ర అభివృద్ధి సంస్థ తరుఫున బ్యాంకులకు ప్రభుత్వం ఇచ్చిన పూచీకత్తు పత్రాల నకలు అందించాలని, సమగ్ర వివరాలను రాజ్యాంగ నిబంధనల ప్రకారం రాష్ట్ర శాసనసభకు తెలపాలని చెప్పారు.