ఎయిడెడ్ విద్యాసంస్థల విషయంలో ప్రభుత్వం ఇచ్చిన నాలుగు జీవోలను రద్దు చేయాలని జనసేన అధినేత పవన్ (Pawan On Aided Schools) డిమాండ్ చేశారు. తమ బిడ్డలు చదువుతున్న విద్యా సంస్థలను ఎప్పటిలాగే కొనసాగించాలని, గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా ఆ విద్యా సంస్థలు నిర్వహణ సాగేలా చూడాలని తల్లిదండ్రులు రోడ్డెక్కిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అనంతపురం, విజయవాడ, కాకినాడ, విశాఖపట్నం...ఇలా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో విద్యార్థులు రోడ్డు మీదకు వచ్చి ప్రభుత్వ నిర్ణయం వల్ల తాము చదివే కాలేజీలు, స్కూళ్లు ప్రైవేట్ విధానంలోకి వెళ్తే ఫీజులు భరించలేమని ఆందోళన చేస్తున్నట్లు గుర్తు చేశారు. మెమో ద్వారా ఎయిడెడ్ విద్యాసంస్థలకు ఆప్షన్లు ఇచ్చామని ప్రభుత్వం ప్రకటన చేసినా.. అందులో మతలబులే కనిపిస్తున్నాయన్నారు. ఆప్షన్ల పేరుతో విద్యార్థులు, తల్లిదండ్రులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని పవన్ దుయ్యబట్టారు.
ఎప్పటిలాగే ఎయిడెడ్ విద్యా సంస్థలు కొనసాగాలంటే.. జీవో నెం. 42, 50, 51, 19లను పూర్తిగా రద్దు చేయాలని కోరారు. 1982 నాటి విద్యాహక్కు చట్టానికి విరుద్ధంగా ఉన్న ఈ జీవోలను రద్దు చేయడంతోపాటు గ్రాంట్ ఇన్ ఎయిడ్ కొనసాగించి ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు.
ఎయిడెడ్ సంస్థల విలీన మార్గదర్శకాలతో అంతర్గత మెమో
ఎయిడెడ్ విద్యా సంస్థలకు గ్రాంటు నిలిపివేతపై విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నుంచి వస్తున్న వ్యతిరేకతతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఆస్తులతో సహా సిబ్బందిని లేదా సిబ్బందిని మాత్రమే ప్రభుత్వానికి అప్పగించేందుకు సమ్మతి తెలిపిన యాజమాన్యాలు కూడా ఇప్పుడు తమ అంగీకారాన్ని వెనక్కి తీసుకునే వెసులుబాటును కల్పించింది. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర శుక్రవారం మెమో జారీ చేశారు. ఇటీవల సీఎం జగన్ చేసిన ప్రకటనకు అనుగుణంగా ఈ ఉత్తర్వులు ఇచ్చారు. ఎయిడెడ్ విద్యా సంస్థల విలీనానికి గతంలో మూడు ఐచ్ఛికాలు ఇవ్వగా.. ఇప్పుడు అంగీకారాన్ని వెనక్కి తీసుకునే ఐచ్ఛికాన్ని కూడా చేర్చారు. పాఠశాల, జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలలకు కలిపి ఈ మెమో ఇచ్చారు.
నాలుగు ఐచ్ఛికాలు.