అన్నదాతలను ఇబ్బంది పెట్టడం సరికాదని జనసేనాని పవన్ కల్యాణ్ అన్నారు. రాజధాని విషయాన్ని సున్నితంగా పరిష్కరించాలని కోరారు. పార్టీ నేతల కోరిక మేరకు వివిధ అంశాలపై జనసేన మీడియా విభాగం నిర్వహించిన ముఖాముఖిలో పవన్ స్పందించారు. దీనికి సంబంధించిన తొలి భాగం వీడియోను పార్టీ విడుదల చేసింది. చాతుర్మాస దీక్ష, వ్రతాలు వ్యక్తిగతంగా చేసే వాడినని.. ఇప్పుడు ప్రజలంతా బాగుండాలనే దీక్ష చేస్తున్నట్లు పవన్ వెల్లడించారు. ఇన్నాళ్లు తెలియలేదని.. ఇప్పుడు ప్రజా జీవితంలో ఉండటంతో ఈ విషయం బయటకొచ్చిందన్ననారు.
కరోనా ప్రపంచ విపత్తు అని పవన్ అన్నారు. దేశంలో విధించిన రెండు నెలలు లాక్ డౌన్ సమయాన్ని ప్రభుత్వం కచ్చితంగా సద్వినియోగం చేసుకుని ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. ప్రణాళికాబద్ధంగా ఎలా వెళ్లాలి అనే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తగా, బాధ్యతగా ఉండి ఉంటే బాగుండేదన్నారు. రాష్ట్రాన్ని నడిపే వ్యక్తులే.. కరోనా అలా వచ్చి.. వెళ్లిపోతుందని.. ఫ్లూ లాంటిది అనడం సరికాదన్నారు. జాగ్రత్తగా చెబితే సామాన్య జనానికి కూడా కరోనా తీవ్రత అర్థం అవుతుందన్నారు.