Pawan Kalyan Tweets: 'రాష్ట్ర ప్రభుత్వం ప్రజల మంచి కోరి పరిపాలన చేస్తున్నట్లు ఏ మూలాన కనిపించడంలేదు' అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. కాకినాడ, కర్నూలు నగరపాలక సంస్థల పరిధిలో ఆస్థి, చెత్తపన్నులకు సంబంధించి జరిగిన ఘటనలపై ఆయన ట్విట్ చేశారు. పన్ను కట్టకపోతే సామాన్లు పట్టుకుపోతామని కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది ట్రాక్టర్లుతో తిరగడం ఏం సూచిస్తోందని ప్రశ్నించారు. డెయిలీ ఫైనాన్స్ వ్యాపారం చేసుకొనేవాళ్ల మాదిరిగా ప్రభుత్వ ఆలోచన విధానం ఉందని పవన్ మండిపడ్డారు.
చెత్త సేకరణకు పన్ను విధించటమే ఒక దరిద్రం అనుకొంటే.. దాన్ని వసూలు చేస్తున్న విధానం మరింత దిగజారుడుగా ఉందని వ్యాఖ్యానించారు. కర్నూలులో వ్యాపారులు చెత్తపన్ను చెల్లించలేదని దుకాణాల ముందు చెత్తను పోసి అవమానిస్తారా అని ప్రశ్నించారు. ఇది కచ్చితంగా మానవ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని పవన్ అభిప్రాయపడ్డారు. ప్రజలు గౌరవప్రదంగా జీవించడం ఈ ప్రభుత్వానికి నచ్చటం లేదని వ్యాఖ్యానించారు.