పలు సమస్యలతో బాధపడుతున్న ప్రజల నుంచి "జనవాణి" కార్యక్రమం ద్వారా వినతులు స్వీకరించారు జనసేన అధినేత పవన్. ఉదయం నుంచి సాయంత్రం వరకు నాలుగు వందల పైచిలుకు దరఖాస్తులు తీసుకున్న పవన్.. అనంతరం మీడియాతో మాట్లాడారు. తాను జనవాణి వంటి కార్యక్రమాలు చేపట్టడం సాహసంతో కూడుకున్నదని పవన్ అన్నారు. జనవాణి కార్యక్రమాలు ప్రభుత్వాలు చేపట్టాల్సిన పని అని గుర్తుచేశారు. వైకాపా ప్రభుత్వానికి బాధ్యత ఎలా నిర్వర్తించాలో తామే తెలియజేస్తున్నామని చెప్పారు.
వైకాపాకు బాధ్యత గుర్తు చేస్తున్నాం : పవన్ కల్యాణ్
జగన్ ప్రభుత్వానికి బాధ్యత ఎలా నిర్వర్తించాలో గుర్తు చేస్తున్నామని.. అందుకోసమే "జనవాణి" కార్యక్రమం నిర్వహిస్తున్నామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. వరుసగా రెండో ఆదివారం విజయవాడలో ప్రజల నుంచి వివిధ సమస్యలపై దరఖాస్తులు స్వీకరించారు. సాయంత్రం మీడియాతో మాట్లాడిన పవన్.. తాను సంపూర్ణంగా దహనం కావడానికి సిద్ధపడే రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు.
"రౌడీయిజం చేసే రాజకీయ నాయకులంటే నాకు చిరాకు. దౌర్జన్యాలు చేసే వారంటే ప్రజలకు భయం. గ్రామాల్లో వేలాది మంది జనం ఉన్నా.. పాతికమంది రౌడీలను చూస్తే భయపడతారు. భయం నిండిన ప్రజల్లో ధైర్యం నూరిపోయాల్సిన అవసరం ఉంది. ఇలా జరగాలంటే.. ముందుగా ఎవరో ఒకరు దహనం కావాల్సి ఉంటుంది. అలా సంపూర్ణంగా దహించుకుపోవడానికి సిద్దమయ్యే నేను రాజకీయాల్లోకి వచ్చాను." అని పవన్ అన్నారు.
వైకాపా నాయకులు, ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో పవన్ ధ్వజమెత్తారు. ఆ పార్టీ నాయకులు స్థాయి మరిచి ప్రవర్తిస్తున్నారని మండి పడ్డారు. "గ్రామ, పంచాయతీలకు నిధులు ఇవ్వకుండా నియంత్రిస్తున్నారు. మహాత్మా గాంధీ చెప్పిన గ్రామ స్వరాజ్యాన్ని పాతరేశారు. పథకాల పేర్లు మార్చినా.. ప్రజలకు మాత్రం లబ్ధి జరగట్లేదు. వేలాది మంది బాధితులకు బీమా పరిహారం సొమ్ము చెల్లించట్లేదు. గతంలో మధ్యవర్తి ప్రమేయం లేకుండా ప్రభుత్వం ద్వారం బీమా పరిహారం చెల్లింపు చేశారు. ఇప్పుడు దళారుల ద్వారా.. ప్రైవేటు బీమా కంపెనీల ద్వారా చెల్లిస్తున్నారు. మధ్యవర్తుల ద్వారా పరిహారం చెల్లింపులు ఎటు పోతున్నాయో అర్థం కావట్లేదు" అని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.