వైకాపా ప్రభుత్వ అనాలోచిత విధానాలే రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభానికి కారణమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ధ్వజమెత్తారు. పల్లెల్లో 11 నుంచి 14 గంటలు, పట్టణాల్లో 5 నుంచి 8 గంటలు, నగరాల్లో 4 నుంచి 6 గంటలు చొప్పున విద్యుత్ కోతలతో జనం అల్లాడిపోతున్నారని పవన్ ఆవేదన చెందారు. సెల్ఫోన్ల వెలుగులో ఆస్పత్రుల్లో ఆపరేషన్లు, ప్రసవాలు జరగడం చూస్తుంటే... కరెంట్ కోతల తీవ్రత ఎలా ఉందో అర్థమవుతోందన్నారు. పరీక్షలకు సన్నద్దమవుతున్న విద్యార్థులు... విద్యుత్ కోతలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గుర్తుచేశారు. ఇళ్లలో కరెంట్ లేక కొందరు రైల్వేస్టేషన్లు, బస్టాండ్లలో పడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
పరిశ్రమలకు 'పవర్ హాలిడే' ప్రకటించడంపైనా పవన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్ర విభజన సమయంలో మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో 2014– 19 మధ్య కూడా కోతల ప్రభావం లేదన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చాక విద్యుత్ ఒప్పందాలు రద్దుచేసి, గతానికంటే ఎక్కువ ధరలకు విద్యుత్ కొనడం ఏంటని ప్రశ్నించారు. 'పవర్ హాలిడే' అనేది పారిశ్రామిక అభివృద్ధికి విఘాతమన్నారు. దీని వల్ల 36లక్షల మంది కార్మికుల ఉపాధికి గండి పడుతుందని పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు.