ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Pawan: 'ఎంపీపీ ఎన్నికలో మా వాళ్లకు అన్యాయం జరిగితే.. నేనే వస్తా'

ఈ నెల 24న జరిగే తూర్పుగోదావరి జిల్లా కడియం మండల పరిషత్ అధ్యక్ష ఎన్నికల్లో మండలాధ్యక్ష పదవిని ఎలాగైనా దక్కించుకోవాలని అధికార పార్టీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారని జనసేన అధినేత పవన్ అన్నారు. తమ పార్టీ సభ్యులపై తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తున్నారని.. గెలిచిన అభ్యర్థులతో పాటు వారి కుటుంబ సభ్యుల్ని భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.

'ఎంపీపీ ఎన్నికలో మా వాళ్లకు అన్యాయం జరిగితే నేనే వచ్చి తేల్చుకుంటా'
'ఎంపీపీ ఎన్నికలో మా వాళ్లకు అన్యాయం జరిగితే నేనే వచ్చి తేల్చుకుంటా'

By

Published : Sep 21, 2021, 10:09 PM IST

'ఎంపీపీ ఎన్నికలో మా వాళ్లకు అన్యాయం జరిగితే నేనే వచ్చి తేల్చుకుంటా'

తూర్పుగోదావరి జిల్లా కడియం మండల పరిషత్ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియను సజావుగా సాగేలా చూడాలని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని కోరారు. కడియం మండల జడ్పీటీసీ స్థానంతోపాటు అత్యధిక ఎంపీటీసీ స్థానాలను జనసేన పార్టీ గెలుచుకోవటంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. గెలిచిన అభ్యర్థులతో విజయవాడలో పవన్ సమావేశమయ్యారు. ఈ నెల 24న జరిగే మండలాధ్యక్ష పదవిని ఎలాగైనా దక్కించుకోవాలని అధికార పార్టీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారని..,తమ పార్టీ సభ్యులపై తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తున్నారన్నారు. గెలిచిన అభ్యర్థులతో పాటు వారి కుటుంబ సభ్యుల్ని భయబ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. అధికార పార్టీ నేతలు పోలీసు అధికారులను వాడుకుని ఇబ్బందులకు గురి చేస్తున్నారని పవన్ ఆరోపించారు.

పొట్టిలంకలో జనసేన అభ్యర్ధి గెలుపొందితే కనీసం గెలిచిన అభ్యర్ధికి దండ వేసే పరిస్థితి లేకుండా నిర్ధాక్షిణ్యంగా కామిరెడ్డి సతీష్ అనే జన సైనికుడిని దారుణంగా కొట్టారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళ్లు పట్టుకుని ప్రాధేయపడినప్పటికీ..పోలీసులు కనికరం చూపలేదన్న విషయాన్ని పార్టీ నాయకులు తన దృష్టికి తీసుకువచ్చారన్నారు. ఇలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో తమ నాయకులకు, కార్యకర్తలకు, ఆడపడుచులకు పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. 24న జరిగే మండలాధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో జనసేన సభ్యులను ఇబ్బంది పెట్టినా, ఓటింగ్​కి రానివ్వకున్నా స్వయంగా తానే కడియం వస్తానన్నారు. తమ వాళ్లకు ఎలాంటి అన్యాయం జరిగినా స్వయంగా తానే వచ్చి తేల్చుకుంటానని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details