Pawan kalyan: పదో తరగతి ఫెయిలయిన విద్యార్థులకు 10 గ్రేస్ మార్కులు ఇవ్వాలని.. రీ కౌంటింగ్, సప్లిమెంటరీ పరీక్షల కోసం వారి నుంచి రుసుములు వసూలు చేయకూడదని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రెండు లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్ష తప్పటానికి తల్లిదండ్రులే కారణమంటూ నెపాన్ని వారిపై నెట్టేసి ఈ ప్రభుత్వం తన చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవచ్చేమో కానీ.. వైకాపా హయాంలో విద్యావ్యవస్థలోని లోపభూయిష్ట విధానాల్ని మాత్రం చరిత్ర దాచిపెట్టుకోదని విమర్శించారు.
‘2018లో 94.48% ఉత్తీర్ణత వచ్చింది. 2019లో 94.88 శాతం. ఈ ఏడాది ఉత్తీర్ణత 67.26 శాతమే. గత ఫలితాలతో పోలిస్తే ఇది అత్యల్పం. నాడు- నేడు పేరిట పాఠశాలలకు రంగులేస్తున్నాం.. ఆంగ్ల మాధ్యమంలో పాఠాలు చెప్పిస్తున్నాం అనగానే సరిపోదు. నాడు- నేడులో వెచ్చించామంటున్న రూ.16 వేల కోట్లు ఎటు పోయాయి? వైకాపా ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఒక్క డీఎస్సీ కూడా ప్రకటించలేదు. తగినంత మంది బోధనా సిబ్బందిని నియమించలేదు.
అరకొరగా ఉన్న ఉపాధ్యాయుల్ని మద్యం దుకాణాల దగ్గర క్యూ లైన్ల నిర్వహణ విధుల్లో వేశారు. మరుగుదొడ్ల నిర్వహణ, మధ్యాహ్న భోజన పథకంలో ఫొటోలు తీయటం వంటి పనులు అప్పగించి బోధన విధులకు దూరం చేశారు. వాటన్నింటి పర్యవసానమే తాజా ఫలితాలు. ఇలాంటి పరిస్థితుల్లో రీ వాల్యుయేషన్ చేస్తాం.. ఒక్కొక్కరూ రూ.500 కట్టండి అంటూ ప్రభుత్వం మరో దోపిడీకి తెరతీసింది. పరీక్ష తప్పిన విద్యార్థుల మానసిక స్థితి, వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవాలి’ అని పవన్ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.