PAWAN FIRES ON POLICE : విజయవాడ పశ్చిమ, జగ్గయ్యపేటలలో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణలను వైకాపా వర్గాలు అడ్డుకున్న తీరు వారిలోని ఓటమి భయాన్ని తేటతెల్లం చేస్తోందని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్‌ను జనసేన జెండా ఆవిష్కరణ చేయకుండా వైకాపా నేతలు, పోలీసులు అడ్డుపడిన వైనం, రిమాండ్ చేయడానికి చేసిన ప్రయత్నాలను తీవ్రంగా ఖండించారు. జగ్గయ్యపేటలో జనసేన పతాక ఆవిష్కరణ కోసం పార్టీ శ్రేణులు నిర్మించుకున్న జెండా దిమ్మెను.. అర్ధరాత్రి వైకాపా దౌర్జన్యకారులు జెసీబీతో కూల్చివేశారన్నారు. ఈ ఘటనలో దోషులపై కేసు నమోదు చేయడానికి బదులు ప్రశ్నించిన జనసేన నాయకులపై కేసులు పెట్టడం ఎంతవరకు న్యాయబద్ధమో పోలీస్ అధికారులు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు.
పార్టీ శ్రేణులు తలపెడుతున్న ప్రతి కార్యక్రమానికి.. అనుమతి లేదనే సాకుతో పోలీసులు అడ్డుపడడం.. అధికార పార్టీకి వత్తాసు పలకడంగానే భావిస్తున్నట్లు పవన్ పేర్కొన్నారు. అధికార పార్టీ అన్ని కార్యక్రమాలను ముందస్తు అనుమతితోనే చేస్తున్నారా అని ప్రశ్నించారు. వాడవాడల్లో పెట్టిన విగ్రహాలకు, జెండా దిమ్మెలు, వారు వేస్తున్న రంగులకు ముందుగా మున్సిపల్, పంచాయతీల అనుమతి తీసుకుంటున్నారా అని నిలదీశారు. జనసేన ఉనికిని తీసిపారేయడం ఎవరి తరం కాదని, ప్రజలే పార్టీని కాపాడుకుంటారని స్పష్టం చేశారు. శాంతి భద్రతలకు ఇబ్బంది కలగకూడదనే సదుద్దేశ్యంతోనే ఇంత జరుగుతున్నా తాను రోడ్ మీదకు రాలేదన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే తను రోడ్డెక్కడం తప్పదదని హెచ్చరించారు. పోలీసులు సర్వీస్ కాలమంతా డ్యూటీలోనే గడుపుతారు. మరో ప్రభుత్వం వస్తే తలదించుకునే పరిస్థితి రాకూడని కోరుకుంటున్నానని, ధర్మాన్ని పాటించమని అధికారులను కోరారు.