ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'భీమ్లానాయక్' కోసం ధర్నాలు.. రాజకీయాలు వద్దంటూ ఆగ్రహం.. - Pawan Kalyan fans protest guntur district

భీమ్లా నాయక్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని పవన్ కల్యాణ్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలు జిల్లాలో ధర్నాలు, నిరసనలు చేపట్టారు. మరోవైపు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే సినిమా టికెట్లను విక్రయించాలని కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్ కె. మాధవీలత స్పష్టం చేశారు.

భీమ్లానాయక్ సినిమాపై కొనసాగుతున్న రగడ
భీమ్లానాయక్ సినిమాపై కొనసాగుతున్న రగడ

By

Published : Feb 24, 2022, 5:20 PM IST

Updated : Feb 24, 2022, 7:12 PM IST

ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే సినిమా టికెట్లు విక్రయించాలని కృష్ణాజిల్లా జాయింట్‌ కలెక్టర్‌ కె.మాధవీలత స్పష్టంచేశారు. మచిలీపట్టణంలో మాట్లాడుతూ.. జిల్లాలో బెనిఫిట్‌ షోలు అదనపు షోలు నిర్వహించేందుకు ఎటువంటి అనుమతులూ ఇవ్వలేదన్నారు. టికెట్లు అధిక ధరకు విక్రయించినా, బ్లాక్‌ మార్కెట్‌లో అమ్మినా థియేటర్‌ యాజమాన్యాలతో పాటు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

చిత్తూరు జిల్లాలో...

భీమ్లా నాయక్ బెనిఫిట్ షో కు అనుమతి ఇవ్వాలని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని జనసేన కార్యకర్తలు, పవన్ కల్యాణ్ అభిమానులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. సినిమాలను రాజకీయాలతో ముడిపెట్టరాదని ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా టికెట్ ధరలు, బెనిఫిట్ షో ప్రదర్శనలపై ముందస్తుగా సినిమా థియేటర్ల యజమానులకు ప్రభుత్వం నోటీసులు జారీ చేయడం దారుణమన్నారు. అనంతరం రెవెన్యూ అధికారులకు వినతిపత్రం సమర్పించారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలోనే సినీపరిశ్రమపై ప్రభుత్వం ఆంక్షలు పెట్టిందంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు తిరుపతిలో నిరసన చేపట్టారు. గాంధీ విగ్రహ కూడలిలో మోకాళ్ళ పై నిలబడి ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపుతో వ్యవహరిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

గుంటూరు జిల్లాలో...

జనసేన అధినేత, పవర్​స్టార్ పవన్ కల్యాణ్ నటించిన సినిమా భీమ్లా నాయక్ విషయంలో ఏపీ ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని పవన్ కల్యాణ్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు సినిమా టికెట్ల విక్రయాలు ప్రారంభం కాలేదని మండిపడ్డారు. బెనిఫిట్ షో లేకపోవడం, టికెట్లు అందుబాటులోకి రాకపోవడం పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ తీరు మీద వీసుగెత్తిన అభిమానులు తమ అభిమాన హీరో నటించిన సినిమా చూడడానికి హైదరాబాద్ వెళుతున్నారు. ఒక్క సినిమా రిలీజ్ పట్ల ప్రభుత్వం ఎందుకంత కఠినంగా వ్యవహరిస్తోందంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

మాచర్లలో నాగార్జున కళామందిర్ థియేటర్ వద్ద హుండీ ఏర్పాటు చేసి వినూత్నంగా నిరసన తెలిపారు. తమ అభిమాన నటుడి సినిమా వల్ల థియేటర్ యజమానులు, డిస్టిబ్యూటర్లు నష్ట పోకూడదని అభిమానులు హుండీ ద్వారా వచ్చే విరాళాలు వారికి అందజేయనున్నట్లు చెప్పారు.

తూర్పుగోదావరి జిల్లాలో...

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా విడుదల సందర్భంగా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై ఆయన అభిమానులు తూర్పుగోదావరి జిల్లా రాజోలులో నిరసన వ్యక్తం చేశారు. స్థానిక రెవెన్యూ కార్యాలయం ముందు భీమ్లా నాయక్ సినిమాకు బెనిఫిట్ షో ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. అనంతరం ఎమ్మార్వో కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. అభిమానులు. పవన్ సినిమాపై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిరంకుశ పోకడలు విడనాడాలని, పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో లేని ఆంక్షలు ఆంధ్రలో ఏంటని అభిమానుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి:'విపక్షాలకు ఆ ధైర్యం లేదు- ఓటు బ్యాంకు పోతుందనే భయం'

Last Updated : Feb 24, 2022, 7:12 PM IST

ABOUT THE AUTHOR

...view details