PAWAN GOING TO VIJAYAWADA : జనసేన అధినేత పవన్‌కల్యాణ్ విశాఖపట్నం నుంచి విజయవాడ చేరుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం పోలీసు అధికారులు పవన్‌కు నోటీసులిచ్చారు. పోలీసుల ఆంక్షలతో రెండు రోజులు హోటల్లోనే ఉండిపోయిన ఆయన.. హెలికాప్టర్లో విజయవాడకు చేరుకున్నారు. నేరుగా మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి వెళ్లారు. విశాఖలో బయల్దేరే ముందు అరెస్ట్ అయ్యి విడుదలైన పలువురితో పవన్ చర్చించారు.
విశాఖలో జనసేన కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేశారని పవన్ కల్యాణ్ అన్నారు. జనసేన కార్యకర్తలపై హత్యాయత్నం కేసులు పెట్టారని.. అక్రమ కేసులపై న్యాయ పోరాటానికి నిపుణులతో చర్చించినట్లు తెలిపారు. ప్రజలకు కనీసం అభివాదం చేయకుండా ఆంక్షలు విధించారని పేర్కొన్నారు. మా పోరాటం ప్రభుత్వం పైనే కానీ పోలీసులపై కాదని స్పష్టం చేశారు. భవిష్యత్‌లో ఇలాంటి ఆంక్షలు విధించకుండా న్యాయపోరాటం చేస్తామని వెల్లడించారు.
రాజభవన్‌కు పవన్ : పవన్ రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలవనున్నట్లు సమాచారం. విశాఖలో జరిగిన పరిణామాలు, పోలీసులు వ్యవహరించిన తీరుపై గవర్నర్‌కు ఆయన ఫిర్యాదు చేసే వీలుంది. ఇప్పటికే జనసేన నేతలు గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరినట్లు తెలుస్తోంది. పవన్‌కల్యాణ్ విజయవాడ రాక నేపథ్యంలో విమానాశ్రయం దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులు భారీగా మోహరించారు. విమానాశ్రయంలోకి ప్రయాణికులను మాత్రమే అనుమతిచ్చారు.