‘అధికారం దక్కని ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు, బలిజ, ఒంటరి కులాలు, మైనారిటీలు, ఇతర వర్గాల్లోని అభ్యుదయ వాదులతో కలిసి వైకాపా విముక్త ఆంధ్రప్రదేశ్‌ను సాధిస్తాం. వచ్చే ఎన్నికల్లో ఇదే జనసేన లక్ష్యం. వైకాపా వ్యతిరేక ఓటును చీలనివ్వబోనని మా పార్టీ ఆవిర్భావ సభలో చెప్పిన విషయానికి కట్టుబడి ఉన్నా. తెలుగుదేశం-మేము కలిసి పోటీ చేస్తాం, మేము-భాజపా కలిసి వెళతాం, మేము-తెదేపా, భాజపా కలిసి పోటీ చేస్తాం.. ఈ మూడింట్లో ఏం జరుగుతుందనేది నేను ఈ రోజు చెప్పలేను. ఎందుకంటే రాజకీయాల్లో వ్యూహాలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. అది ఏ వ్యూహమైనా కానివ్వండి వైకాపా విముక్త ఆంధ్రప్రదేశే జనసేన లక్ష్యం’ అని ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ ప్రకటించారు. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలోనూ ఈ మేరకు తీర్మానం ఆమోదించినట్లు తెలిపారు. మంగళగిరిలో నిర్వహించిన సమావేశం అనంతరం పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్‌తో కలిసి సోమవారం సాయంత్రం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జనసేనలో ఒక కులానికే ప్రాధాన్యం ఇవ్వబోమని, అసలు కులస్వామ్యమే ఉండబోదన్నారు. పవన్‌కల్యాణ్ ఏమన్నారో ఆయన మాటల్లోనే...
మోదీ-చంద్రబాబు కలుస్తారని ఎవరైనా అనుకున్నారా?
‘మోదీ, చంద్రబాబు ఇక కలబోవరని చాలామంది అనుకున్నారు. మొన్న వారిద్దరూ కలిసి మాట్లాడుకోలేదా? వారేం మాట్లాడుకున్నారో నాకు తెలియదు. కానీ, రాజకీయాల్లో పరిస్థితులు ఎప్పుడెలా ఉంటాయో చెప్పలేం. తెలంగాణ ఏర్పాటు నాటికి తెరాసను కాంగ్రెస్‌లో కలిపేస్తానని కేసీఆర్ చెబుతూ వచ్చారు. కుటుంబంతో సహా సోనియాగాంధీని కలిసేందుకు వెళ్లారు. అక్కడ ఏం జరిగిందో తెలియదు. కానీ, ఆయన విడిగా పోటీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు.
రాయలసీమ నుంచే చాలామంది ముఖ్యమంత్రులు వచ్చారు. ఆ ప్రాంతంలో రూ.వేల కోట్ల మైనింగ్ జరుగుతోంది. అక్కడ యువతకు మాత్రం ఉపాధి లేదు. అక్కడి సెటిల్‌మెంట్ కల్చర్ కారణంగానే ప్రాజెక్టులు రావడం లేదు. సీమ నాయకులు ఎవరైనా కోస్తాలో పెట్టుబడులు పెడతారు. అదే సమయంలో కోస్తా, ఇతర ప్రాంతాల నుంచి రాయలసీమ వెళ్లి ఎవరూ పెట్టుబడులు ఎందుకు పెట్టలేకపోతున్నారు? ఎందుకంటే... ఆ ప్రాంతాన్ని గుప్పిట్లో పెట్టుకున్న నాయకులకు కప్పం కట్టాలి. రాయలసీమ కొద్ది మంది నాయకుల చేతుల్లోనే ఉండటంతో (ఒక కులం అని చెప్పడం లేదు. ఒక పార్టీ అని చెప్పడం లేదు) ఈ పరిస్థితి ఏర్పడింది. అందుకే సీమ నుంచి రాజకీయాల్లోకి కొత్త రక్తం రావాలి. తిరుపతిలో నిర్వహించిన మా జనవాణికి కాశ్మీర్‌లో పనిచేసే ప్రసాద్ అనే సైనికుడు వచ్చి... తన రెండెకరాల భూమిని చిత్తూరు జిల్లాలో కబ్జా చేశారని ఆందోళన వ్యక్తంచేయడం గమనార్హం.