ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సీఎం కాన్వాయ్ కోసం.. ప్రజల వాహనాల స్వాధీనమేంటి?: పవన్‌ కల్యాణ్‌ - పవన్ కల్యాణ్ తాజా వార్తలు

ముఖ్యమంత్రి కాన్వాయ్ కోసం ప్రయాణికులను నడిరోడ్డుపై వదిలేస్తారా? అని జనసేన అధినేత పవన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సీఎం పర్యటనకు ప్రభుత్వ వాహనాలు సమకూర్చలేని పరిస్థితి వచ్చిందా? అని నిలదీశారు. ఎవరి ఒత్తిడితో అధికారులు వాహనం తీసుకున్నారో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

సీఎం కాన్వాయ్ కోసం ప్రజల వాహనాల స్వాధీనమేంటి ?
సీఎం కాన్వాయ్ కోసం ప్రజల వాహనాల స్వాధీనమేంటి ?

By

Published : Apr 21, 2022, 3:22 PM IST

ముఖ్యమంత్రి కాన్వాయ్ కోసం ప్రజల వాహనాలు స్వాధీనం చేసుకోవటమేంటని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ప్రశ్నించారు. సీఎం పర్యటనకు ప్రభుత్వ వాహనాలు సమకూర్చలేని పరిస్థితి వచ్చిందా? అది నిలదీశారు. ఎవరి ఒత్తిడితో తిరుమలకు వెళ్తున్న భక్తుల వాహనం తీసుకున్నారో స్పష్టత ఇవ్వాలన్న పవన్.. సీఎం కాన్వాయ్ కోసం వారిని నడిరోడ్డుపై వదిలేస్తారా? అని ప్రశ్నించారు. ఒంగోలు ఘటనపై రాష్ట్ర ప్రజలకు సీఎంవో వివరణ ఇవ్వాలన్నారు. ఈ ఘటనపై సీఎస్‌ కూడా విచారణ చేయాలని పవన్ డిమాండ్ చేశారు.

ఏం జరిగిందంటే..? :ముఖ్యమంత్రి కాన్వాయ్‌ కోసమంటూ.. ఒంగోలులో ఆర్టీఏ అధికారులు దౌర్జన్యకాండకు తెరతీశారు. అద్దెకు తెచ్చుకున్న వారికి చెప్పకుండా.. నిన్న అర్థరాత్రి ఇన్నోవా కారును బలవంతంగా తీసుకెళ్లిపోయారు. ఏం జరుగుతుందో తెలియక.. వినుకొండ నుంచి తిరుమల దైవ దర్శనానికి వెళ్తున్న కుటుంబం మార్గ మధ్యలో నడిరోడ్డుపై అవస్థలు పడాల్సి వచ్చింది.

పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన ఫ్లెక్సీ వ్యాపారి వేముల శ్రీనివాస్‌ కుటుంబసభ్యులతో తిరుపతి బయలుదేరారు. ఇన్నోవా కారును అద్దెకు తీసుకుని తిరుపతి పయనమయ్యారు. మార్గ మధ్యలో అల్పాహారం కోసం ఒంగోలులోని కర్నూలు రోడ్డు వద్ద ఆగారు. అంతలో.. అక్కడికి వచ్చిన ఓ రవాణాశాఖాధికారి దౌర్జన్యకాండకు తెరతీశారు. శుక్రవారం సీఎం జగన్ పర్యటన ఉందని పోలీస్‌ కాన్వాయ్ కోసం ఇన్నోవా కారు కావాలని చెప్పారు. కారులో ఉన్న లగేజీ మొత్తం తీసుకోవాలని ఆదేశించారు. ఆర్టీఏ అధికారుల తీరుతో వేముల శ్రీనివాస్ కుంటుంబం.. అవాక్కైంది. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో నడిరోడ్డుపై కారు వదిలేసి దిగిపోమంటే ఎలా అని ప్రశ్నించారు. చిన్న పిల్లలు ఉన్నారని వేడుకున్నా ఆర్టీఏ అధికారులు ఒప్పుకోలేదు. బలవంతంగా కారును తీసుకెళ్లిపోయారు. ఆర్టీఏ అధికారుల తీరుతో వేముల శ్రీను కుటుంబ సభ్యులు..ఒంగోలులో నడిరోడ్డుపైనే ఆగిపోయి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరో వాహనంలో తిరుమల చేరుకున్న వేముల శ్రీనివాస్‌ కుటుంబం...ఆర్టీఏ అధికారుల తీరుపై మండిపడ్డారు.

"అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో..కొత్త ప్రదేశంలో నడిరోడ్డుపై కాసేపు భయంతో గడిపాం. పిల్లలున్నారని వేడుకున్న ఒప్పుకోలేదు. ప్రజలను ఇబ్బందిపెట్టే ఇలాంటి ఘటనలపై సీఎం దృష్టి సారించాలి. అలిపిరి నుంచి మెట్లపూజతో కాలినడకన తిరుమల వెళ్లాలనుకున్నాం.. ఆర్టీఏ అధికారుల తీరుతో మూడోసారి మెట్లపూజ మొక్కు చెల్లించకుండానే తిరుమల చేరుకున్నాం" -వేముల శ్రీనివాస్‌

ఈ ఘటనపై 'ఈటీవీ భారత్'​ కథనం ప్రచురించింది. ఈ ఘటనపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తడంతో సీఎంవో స్పందించింది. సీఎం జగన్​ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఉన్నతాధికారులు ఆర్టీఏ సిబ్బంది ఇద్దరిపై సస్పెన్షన్​ వేటు వేశారు.

ఇదీ చదవండి: ఈటీవీ భారత్​ ఎఫెక్ట్​: సీఎం కాన్వాయ్ కోసం ప్రైవేట్​ కారు.. ఇద్దరిపై సస్పెన్షన్​ వేటు

ABOUT THE AUTHOR

...view details