కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని గండికోట రిజర్వాయర్ ముంపు పరిధిలో ఉన్న తాళ్లప్రొద్దుటూరు గ్రామస్థులను వరద ముప్పు నుంచి కాపాడాలని... ఇందుకు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు తక్షణం చర్యలు చేపట్టాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోరారు. తమ కాలనీలోకి రిజర్వాయర్ నీరు వస్తోందని, తమను కాపాడాలని స్థానికులు చేసిన విజ్ఞప్తిని జనసేన ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్య తన దృష్టికి తీసుకువచ్చారన్నారు.
క్షేత్రస్థాయి పరిశీలన...
కాలనీవాసులు ఇచ్చిన సమాచారం ఆధారంగా... జనసేన స్థానిక నాయకులు క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లి చూశారని... అక్కడి పరిస్థితి దయనీయంగా ఉందని తనకు వివరించారన్నారు. తమకు ఇంకా పరిహారం అందకపోవడం వల్ల తాము అక్కడే ఉండిపోయామని కాలనీవాసులు చెబుతున్నారని... వేరేచోట ఇల్లు అద్దెకు తీసుకునే ఆర్థిక స్థోమత వారికి లేదన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వారు ఎక్కడికి వెళతారని ప్రశ్నించారు. వృద్దులు, చంటి పిల్లలు, చివరికి గర్భిణీలు ఉన్నారని... వరద ఎప్పుడు ముంచేస్తుందోనని బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది చాలా అమానుషమన్నారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని కోరారు.