రైతులు చేస్తోన్న ఆందోళనలపై కేంద్ర ప్రభుత్వం స్పందించి వారితో చర్చలు జరుపుతున్నప్పుడు.. సుమారు ఏడాది కాలంగా నిరసనలు తెలుపుతున్న అమరావతి రైతులను పిలిచి చర్చించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి లేదా..? అని ప్రభుత్వ మాజీసలహాదారు పరకాల ప్రభాకర్ ప్రశ్నించారు. ఆరేళ్లయినా ఇప్పటికీ రాష్ట్ర ప్రజలకు తమ రాజధాని ఎక్కడుందో తెలియని దుస్థితి ఏర్పడిందన్నారు. ఈ తరహా పరిస్థితులు దేశంలో, ప్రపంచంలో మరెక్కడా లేవని అన్నారు.
"ఆంధ్రప్రదేశ్ ప్రజలు దశాబ్దాలుగా రాజధాని కోసం తిరగాలా..?. ప్రజాస్వామ్యం అంటే ప్రజలు ఐదేళ్లకు ఓసారి ఓటు వేసి కూర్చోవడం కాదు. రాజధాని అనేది ఎక్కడో తేల్చుకోలేని సందిగ్ధత కొనసాగుతున్నప్పుడు- సంచారంగా ఒకచోట నుంచి మరోచోటకు వెళ్లడం కాకుండా తగిన పరిష్కారం తీసుకోవాలి. ఒకప్పుడు అమరావతిలో రాజధాని ఏర్పాటును సమర్థించి ఇవాళ యూటర్న్ తీసుకుంటారా..?. మూడు రాజధానుల పేరిట మారుతున్న పరిస్థితులపై విస్తృతంగా చర్చించి ప్రజాస్వామ్యయుత పరిష్కారం చూపాలి. రాష్ట్రం నడిబొడ్డున రాజధానిలో నిత్యం ముఖ్యమంత్రి, మంత్రులు సంచరించే రహదారి పక్కనే రాజధాని కోసం భూములిచ్చిన రైతులు ఆందోళన చేస్తుంటే.. వారిని పిలిచి మాట్లాడరా..?." -పరకాల ప్రభాకర్