బీసీ కార్పొరేషన్ ఛైర్మన్లు, డైరెక్టర్లుగా బాధ్యతలు తీసుకున్న వారంతా బాధ్యతాయుతంగా పని చేయాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి సూచించారు. ప్రభుత్వం బీసీల కోసం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాల పర్యవేక్షణ సహా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. కష్టపడి పనిచేసి ప్రభుత్వానికి మంచిపేరు తీసుకురావాలన్నారు.
కృష్ణా జిల్లాకు చెందిన బీసీ కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్ల అభినందన సభ విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సోమవారం జరిగింది. దీనికి కృష్ణా జిల్లా ఇన్ఛార్జి మంత్రి హోదాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గుంటూరు, కృష్ణా జిల్లాల వైకాపా పర్యవేక్షకుడు ఎంపీ మోపిదేవి వెంకటరమణ, మంత్రి కొడాలి నాని, జిల్లా ఎమ్మెల్యేలు, పలు బీసీ కుల సంఘాల నేతలు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా నుంచి నియమితులైన నలుగురు బీసీ కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్లను సన్మానించారు. దేశంలో ఎక్కడాలేని రీతిలో రాష్ట్రంలో 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాటికి ఛైర్మన్లు సహా 672 మంది డైరెక్టర్లను సీఎం జగన్ నియమించారని నేతలు ప్రశంసించారు.