ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 14, 2021, 8:18 AM IST

ETV Bharat / city

Corona Effect : అనాథ చిన్నారులకు అండగా.. ఆపన్నహస్తాలుండగా..!

కరోనా ఎందరో పిల్లలను అనాథలుగా మిగిల్చింది. నిన్నా మొన్నటి వరకు తల్లిదండ్రుల చెంత చింత లేకుండా గడిపిన చిన్నారుల బతుకులు ఒక్కసారిగా చీకట్లోకి వెళ్లిపోయాయి. వారి జీవితాల్లో మహమ్మారి నింపిన చీకట్లను తొలగించి.. మేమున్నామంటూ కొందరు ఆపన్న హస్తం అందిస్తున్నారు. పిల్లలు లేక దత్తత తీసుకుంటున్న వారు కొందరైతే.. చేయూతనందించి చేరదీస్తున్నవారు మరికొందరు.

Corona Effect
Corona Effect

రోనా మహమ్మారి ప్రభావంతో కన్నప్రేమకు దూరమైన చిన్నారులను అక్కున చేర్చుకుని ఆప్యాయతలు పంచేందుకు ఆపన్నహస్తాలు ఎన్నో ముందుకొస్తున్నాయి. అప్పటివరకు కంటికి రెప్పలా చూసిన తల్లిదండ్రుల స్థానాన్ని తాము భర్తీ చేస్తామంటూ ఎందరో ఆదర్శంగా నిలుస్తున్నారు. కొవిడ్‌తో తల్లిదండ్రులు మరణించిన పిల్లల్ని అక్కున చేర్చుకుంటున్నారు. ఇదే అదనుగా మోసగాళ్లు వసూళ్ల దందాకు పాల్పడుతున్నారని.. నిజంగా దత్తత తీసుకోవాలనుకునేవారు చట్టప్రకారం ముందుకెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు.

ఆస్తిపాస్తులున్నాయి. ఆరోగ్యంగా ఉన్నాం. మాకు ఇద్దరు ఆడపిల్లలు. కొవిడ్‌తో తల్లిదండ్రులను కోల్పోయిన బిడ్డల్లో ఎవర్నైనా అక్కున చేర్చుకోవాలని అనుకుంటున్నాం. మగ పిల్లవాడిని దత్తత తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నాం

- దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన ప్రభుత్వ ఉద్యోగి

నా కుమార్తె కడుపులో బిడ్డను నవమాసాలు మోసింది. ఎదుగుదల లోపంతో ప్రాణాలు కాపాడలేకపోయాం. తన గర్భసంచిలో తలెత్తిన సమస్యతో భవిష్యత్‌లో తల్లి అయ్యే అవకాశం లేదు. కరోనా వల్ల అమ్మానాన్నలను కోల్పోయిన పిల్లల గురించి వాకబు చేస్తున్నాం. బిడ్డను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాం. చట్టప్రకారం దత్తత తీసుకునేందుకు అధికారులను సంప్రదిస్తున్నాం

- ఫిలింనగర్‌కు చెందిన ఓ గృహిణి

దరఖాస్తులు వస్తున్నాయి..

కొవిడ్‌తో తల్లిదండ్రులను కోల్పోయి దయనీయ పరిస్థితుల్లో ఉన్న చిన్నారుల కోసం ప్రభుత్వం వెంగళరావునగర్‌లోని మహిళా శిశు సంక్షేమశాఖ కార్యాలయంలో సహాయ కేంద్రాన్ని ఏర్పాటుచేసి నిరంతరం పర్యవేక్షిస్తోంది. 31 జిల్లాల్లో ఇలాంటి పిల్లలకు విద్య, వసతి సదుపాయం కల్పిస్తున్నారు. మహిళా-శిశు సంక్షేమశాఖ నిర్వహిస్తున్న సహాయక కేంద్రాన్ని రోజూ 40-50 మందికి పైగా సంప్రదిస్తుంటారు. అందులో 10-20 వరకూ అనాథ పిల్లల దత్తత గురించే ఉంటున్నట్టు అధికారులు తెలిపారు. ఏప్రిల్‌ 19 నుంచి మే నెలాఖరు వరకూ సుమారు 100-120 మంది దరఖాస్తు చేసుకున్నట్టు సమాచారం. స్పందించి ముందుకు వస్తున్న వారిలో పెళ్లయి ఏళ్లు గడుస్తున్నా పిల్లలు పుట్టని దంపతులు, అప్పటికే ఒకరిద్దరు పిల్లలున్నా.. మరొక బిడ్డను సాకేందుకు స్తోమత ఉన్నవారూ ఉంటున్నారు.

చట్టప్రకారమే దత్తత

సామాజిక మాధ్యమాలు, మధ్యవర్తుల మాటలు నమ్మి పిల్లలను దత్తత తీసుకోవటం చట్టరీత్యా నేరం. దత్తతకు ప్రత్యేకమైన చట్ట ప్రక్రియ ఉంది. జువైనల్‌ జస్టిస్‌ యాక్ట్‌ (కేర్‌ అండ్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చిల్డ్రన్‌) 2015, సెంట్రల్‌ అడాప్షన్‌ రిసోర్స్‌ అథారిటీ-2017 నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకోవాలి. మహిళా-శిశు సంక్షేమ శాఖ, జిల్లా శిశు సంరక్షణ విభాగం (డీసీపీయూ), పిల్లల సంక్షేమ కమిటీ (సీడబ్ల్యూసీ), చైల్డ్‌ లైన్‌ వంటి సంస్థలు దత్తత ప్రక్రియను పర్యవేక్షిస్తుంటాయి. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ మూడు దశల్లో ఉంటుంది. దరఖాస్తు చేసే దంపతుల ఫొటో/పాన్‌కార్డు/జనన ధ్రువీకరణ పత్రం/ఆధార్‌కార్డు/నివాస/దత్తత తీసుకునే వ్యక్తులు శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నారంటూ వైద్య ధ్రువీకరణ, మ్యారేజ్‌ సర్టిఫికెట్‌, ఒకవేళ విడాకులు/ఒంటరిగా ఉన్నవారైతే సంబంధిత పత్రాలను జతచేయాల్సి ఉంటుంది.

ABOUT THE AUTHOR

...view details