కృష్ణాజిల్లా మచిలీపట్నం గొల్లపాలానికి చెందిన కోటేశ్వరరావు తాను చనిపోతూ ఎనిమిది మంది జీవితాల్లో వెలుగులు నింపుతున్నాడు. ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్‌డెడ్ అయిన కోటేశ్వరరావు అవయవాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకొచ్చారు. గుండె, ఊపిరితిత్తులు, కాలేయం చెన్నైలోని వివిధ ఆసుపత్రులకు తరలించనున్నారు. కిడ్నీ, కళ్లను గుంటూరులోని రమేశ్, అగర్వాల్ ఆస్పత్రులకు గ్రీన్ ఛానెల్ ద్వారా తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.
పెళ్లికి వెళ్లి వస్తూ..
ఈ నెల 22న పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలులో జరిగిన వివాహానికి వెళ్లి వస్తుండగా కోటేశ్వరరావు అదుపుతప్పి ద్విచక్ర వాహనంపై నుంచి కిందపడ్డాడు. ఈ ఘటనలో ఆయన తీవ్ర గాయాలపాలయ్యాడు. ఆయనను వెంటనే విజయవాడ ఆంధ్ర హాస్పిటల్‌కి తరలించారు. పరిస్థితి విషమించటంతో మంగళగిరి ఎన్నారై ఆసుపత్రికి తరలించారు.చికిత్స పొందుతూ కోటేశ్వరావు.. ఈ ఉదయం బ్రెయిన్ డెడ్‌కు గురయ్యారు. దీంతో ఆయన అవయవాలను దానం చేసేందుకు కుటుంబసభ్యులు ముందుకు వచ్చారు.