కొత్త వేతన స్కేళ్ల ప్రకారం ఇచ్చిన హెచ్ఆర్ఏలో మార్పులు చేస్తూ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడ సమీప ప్రాంతాల్లోని హెచ్‌వోడీ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు హెచ్ఆర్ఏను 8 నుంచి 16 శాతానికి పెంచుతూ ఆదేశాలిచ్చింది. విజయవాడ శివార్లలోని ఇబ్రహీంపట్నంలో ఉన్న డైరెక్టర్ వర్క్స్, పే అండ్ అకౌంట్స్ కార్యాలయ ఉద్యోగుల నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు ఇంటి అద్దె భత్యాన్ని 8 నుంచి 16 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
కొత్త పే స్కేళ్ల ప్రకారం 8 శాతం హెచ్ఆర్ఏ వర్తిస్తున్న అన్ని ప్రాంతాల్లోని హెచ్‌వోడీ కార్యాలయాల ఉద్యోగులకూ ఇంటి అద్దె భత్యాన్ని 16 శాతానికి పెంచుతున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈమేరకు ఆర్ధికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ నుంచి తరలి వచ్చిన అన్ని హెచ్‌వోడీ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకూ ఈ హెచ్ఆర్ఏ పెంపు వర్తిస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
ప్రస్తుతం వెలగపూడి సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులకు 16 శాతం హెచ్ఆర్ఏను వర్తింప చేస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. వీరితో సమానంగానే విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లోని హెచ్‌వోడీ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు హెచ్ఆర్ఏ పెంపు వర్తిస్తుందని వెల్లడించింది.