తెలంగాణలోని కల్వకుర్తి ఎత్తిపోతల పథకం మొదటి లిఫ్ట్‌లో నీట మునిగిన ఎల్లూరు పంపు హౌజ్‌ను సందర్శించేందుకు శనివారం వివిధ పార్టీల నేతలు చేసిన ప్రయత్నాలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లి మీదుగా.. కొల్లాపూర్ మండలం ఎల్లూరుకు వెళ్లాలని భావించిన కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, మాజీ ఎంపీ మల్లు రవి సహా ఇతర నేతలు పోలీసులు తెలకపల్లి వద్ద అడ్డుకున్నారు. దీంతో నేతలంతా కారు నుంచి బైటకు రాకుండా తమ నిరసన కొనసాగించారు.
ఎక్కడికక్కడ నేతల అరెస్టులు..
ఈలోగా అక్కడకు చేరుకున్న కాంగ్రెస్ శ్రేణులు తమ నాయకులను పంప్ హౌజ్ సందర్శనకు అనుమతించాలని డిమాండ్ చేస్తూ.. నాగర్ కర్నూల్- అచ్చంపేట రోడ్డుపై బైఠాయించారు. దీంతో రాకపోకలకు కొద్దిసేపు అంతరాయం ఏర్పడింది. రేవంత్, సంపత్, మల్లు రవిలను పోలీసులు అరెస్టు చేసి ఉప్పునూతల పోలీసు స్టేషన్‌కు తరలించారు.
కేఎల్‌ఐ (కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్)కి పక్కనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సొరంగ మార్గం నిర్మాణ పనులు చేపట్టవద్దని నిపుణుల కమిటీ సూచించినా.. కమిషన్లకు కక్కుర్తి పడి డిజైన్ మార్పు చేశారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఓపెన్ కెనాల్‌గా ఉన్న డిజైన్‌ను సొరంగ మార్గంగా మార్చారన్నారు. పెద్దకొత్తపల్లిలో కాంగ్రెస్ సీనియర్ నేత చిన్నారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొల్లాపూర్‌లో ధర్నా నిర్వహించిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు.
మీడియా ప్రతినిధులకూ అనుమతి నిరాకరణ..
పంపు హౌజ్ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించిన నాగర్ కర్నూల్ జిల్లా భాజపా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్ రావును అరెస్టు చేసి కోడెరు పోలీసు స్టేషన్‌కు తరలించారు. సుధాకర్ రావు అరెస్టుకు నిరసనగా కొల్లాపూర్‌లో భాజపా శ్రేణులు ధర్నా చేపట్టారు. ఎల్లూరుకు వెళ్తున్న సీపీఎం నాయకులను సైతం అదుపులోకి తీసుకున్నారు. ఎల్లూరు పంప్ హౌజ్‌లోకి మీడియాను కూడా అనుమతించలేదు. మీడియా ప్రతినిధులు సైతం అక్కడ బైఠాయించి తమ నిరసన తెలిపారు.
గద్వాల నుంచి ఎల్లూరుకు బయలుదేరిన భాజపా జాతీయ అధ్యక్షురాలు డీకే అరుణను పెబ్బెరు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పంపుహౌజ్‌లో ఏం జరిగిందో తెలుసుకునేందుకు ప్రతిపక్షనేతల్ని అనుమతించకపోవడంపై డీకే అరుణ అభ్యంతరం వ్యక్తం చేశారు. కాలినడకనైనా ఎల్లూరు చేరుకుంటామని, పోలీసులు అడ్డుకోవద్దని హెచ్చరించారు. భాజపా శ్రేణులు సైతం నిరసనకు దిగడం వల్ల డీకే అరుణను పోలీసులు అరెస్టు చేసి పెబ్బేరు పోలీసు స్టేషన్‌కి తరలించారు.
అసలు పంప్ హౌజ్‌లో ఏం జరిగింది..?
పంపు హౌజ్ నీటమునిగిన నేపథ్యంలో కేఎల్‌ఐ సిబ్బంది, మిషన్ భగరథ, నీటి పారుదల శాఖ అధికారులు మినహా ఎవరినీ పోలీసులు లోపలికి అనుమతించలేదు. రోజూ పనిచేసే సిబ్బంది సెల్ ఫోన్లు కూడా లోపలికి అనుమతించలేదని తెలిసింది. ఈ నేపథ్యంలో అసలు పంప్ హౌజ్‌లో ఏం జరిగింది.? ప్రస్తుతం ఎత్తిపోతల పరిస్థితి ఏమిటి ? ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు మిషన్ భగీరథ ద్వారా నీళ్లందించే ఎల్లూరు లిఫ్ట్ పని చేస్తుందా లేదా అన్న అంశాలపై తీవ్ర చర్చ కొనసాగుతోంది. విపక్ష నేతలు సహా ఎవరినీ లోనికి అనుమతించకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదీ చదవండి:కల్వకుర్తి ఎత్తిపోతల వద్ద ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డికి గాయం