Condolences to Mekapati Gautam Reddy: రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి.. గుండెపోటుతో మరణించారు. ఆయన మృతిపట్ల పలువురు రాజకీయ నేతలు నివాళులర్పించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.
సోమువీర్రాజు దిగ్భ్రాంతి..
మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతి పట్ల.. భాజపా రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిన్న వయసులోనే ఆయన మరణం చాలా బాధాకరమని అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం మంత్రి ఎంతో కృషి చేశారని అన్నారు. శాసనమండలికి హాజరైన సందర్భంలో గౌతంరెడ్డితో తనకు ఉన్న అనుబంధాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. రాష్ట్రం ఒక ఆదర్శవంతమైన రాజకీయ నేతను కోల్పోయిందన్నారు.
పార్టీలతో సంబంధం లేకుండా అందిరితోను ఆప్యాయంగా ఉండేవారు: శైలజనాథ్
సౌమ్యుడు, మృదు స్వభావిగా ఉండే మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం తీవ్రంగా కలిచివేసిందని.. ఏపీసీసీ అధ్యక్షుడు శైలజనాథ్ అన్నారు. రాజకీయంగా మరింత ఎత్తుకు ఎదగాల్సిన గౌతమ్ రెడ్డిని మృత్వువు కబళించడం బాధాకరమని పేర్కొన్నారు. గౌతమ్ రెడ్డి పార్టీలతో సంబంధం లేకుండా అందిరితోను ఆప్యాయంగా కలిసిపోయేవారని, హుందాగా ప్రవర్తించేవారన్నారు. ప్రజాప్రతినిధిగా ప్రజలకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. వారి కుటుంబసభ్యులకు సంతాపాన్ని ప్రకటించారు.