తెదేపా కార్యాలయాలు, నేతల ఇళ్లపై దాడులను కాంగ్రెస్, భాజపాలు ఖండించాయి. దాడులు చేసిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. నిందితులను శిక్షించి ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని కోరారు.
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా ?
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? అని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రతిపక్షాలకు ప్రశ్నించే హక్కు లేదా ? అని నిలదీశారు. వైకాపా అధికారంలోకి వచ్చాక విధ్వంసాలు, కూల్చివేతలు నిత్యకృత్యమయ్యాయని విమర్శించారు. పార్టీలు అభిప్రాయాలను వ్యక్తపరిచే స్వేచ్ఛ లేకపోవడం దారుణమన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ చేసి నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇవాళ్టి దాడులపై కేంద్రం సమీక్షించాలని కోరారు.