Opposition Parties Reaction On PRC: పీఆర్సీ విషయంలో ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వ ఉద్యోగులను మోసం చేశారని ఏపీసీసీ అధ్యక్షుడు సాకే శైలజనాథ్ మండిపడ్డారు. జగన్ నిర్ణయాలు ఉద్యోగ సంఘాల నేతలకు మాత్రమే నచ్చాయని ఎద్దేవా చేశారు. ఉద్యోగులు డిమాండ్ చేసిన ఫిట్‌మెంట్ కంటే.. 20 శాతం తగ్గితే ఉద్యోగ సంఘాల నేతలు ఎలా సమర్థిస్తారని ప్రశ్నించారు. హెచ్ఆర్ఏపై ప్రభుత్వం సరైన స్పష్టత ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. లక్షల జీతాలు తీసుకునే సలహాదారులు ఏం చేస్తున్నారని శైలజానాథ్ నిలదీశారు.
ఇది రివర్స్ పీఆర్సీ..
ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ రివర్స్ టెండరింగ్ వలే రివర్స్ పీఆర్సీగా ఉందని ప్రోగ్రెసివ్ డెమొక్రటిక్ ఫ్రంట్ ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు విమర్శించారు. పీడీఎఫ్ ఎమ్మెల్సీలుగా శాసనమండలిలోనూ, బయట ఉద్యోగుల తరఫున పోరాడతామన్నారు. ఉద్యోగ పదవీ విరమణ కాలాన్ని పెంచటం వెనుక ఉన్న దురుద్దేశ్యం.. పదవీ విరమణ అనంతరం వచ్చే ఆర్థిక అంశాలను తొక్కి పెట్టేందుకేనని ఆయన విమర్శించారు. ఆరోగ్య శాఖ ఉద్యోగుల సర్వీసుని కలెక్టర్లకు అప్పగించే జీవో 64, ఉద్యోగుల సంఖ్యను తగ్గించే జీవో 143లను తాము వ్యతిరేకిస్తున్నామన్నారు.
చరిత్రలో ఇదే తొలిసారి..
ఐఆర్ కంటే ఫిట్‌మెంట్ తక్కువగా ఇవ్వడం చరిత్రలో ఇదే తొలిసారని ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం విమర్శించారు. ఉద్యోగ, ఉపాధ్యాయులను ఇది పూర్తిగా నిరాశ పరిచిందన్నారు. పీఆర్సీ ఫిట్‌మెంట్ 23 శాతంతో సరిపెడుతూ.. సీఎం జగన్ చేసిన ప్రకటనతో ఉపాధ్యాయ, ఉద్యోగులు దగా పడ్డారన్నారు. రాబోయే రోజులలో పీఆర్సీ ఉండదని.. ఇదే చివరి పీఆర్సీ అన్నట్లు చెప్పారన్నారు.
ఆ నివేదికను ఎందుకు తొక్కిపెట్టారు...
పీఆర్సీ విషయంలో అశుతోష్ మిశ్రా కమిటీ నివేదికను ప్రభుత్వం ఎందుకు తొక్కిపెట్టిందని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ప్రశ్నించారు. చీఫ్ సెక్రటరీ నివేదిక ఆధారంగా ఐఆర్ కంటే తక్కువగా ఫిట్‌మెంట్ ప్రకటించటం విడ్డూరంగా ఉందన్నారు. సీఎం జగన్ చుట్టూ చేరిన మేథావుల ఆలోచనలు.. ఉద్యోగులకు తీవ్ర ఆవేదనను, నిరాశను మిగిల్చాయని విమర్శించారు. ఎనిమిది డీఏలు నగదురూపంలో చెల్లించకుండా.., పీఆర్సీలో కలిపేస్తామంటూ ఇన్‌డైరెక్ట్‌గా ఒక్కో ఉద్యోగి సొమ్ము రూ.4 లక్షలు తినేస్తున్నారని ఆరోపించారు.
23 శాతం ఫిట్‌మెంట్..
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు 23 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించింది. ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచింది. ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో శుక్రవారం మధ్యాహ్నం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి.. ఫిట్‌మెంట్ సహా కీలక అంశాలపై ప్రకటన చేశారు. ఇకపై రాష్ట్ర ప్రభుత్వం వేతన సవరణ సంఘాల్ని నియమించబోదని, కేంద్ర వేతన సవరణ సంఘం సిఫారసుల్నే అనుసరిస్తామని, ఉద్యోగులకు కూడా దానివల్లే ఎక్కువ మేలు జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఉద్యోగులకు ప్రభుత్వం ఇప్పటికే 27 శాతం ఐఆర్ అమలు చేస్తోంది. వారికి 14.29 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని సీఎస్ కమిటీ సిఫారసు చేసింది. 55 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని ఉద్యోగ సంఘాల ఐకాసలు, కనీసం 34 శాతమైనా ఇవ్వాలని సచివాలయ ఉద్యోగుల సంఘం డిమాండ్ చేశాయి. వీటన్నింటినీ సమీక్షించిన ప్రభుత్వం 23 శాతం ఫిట్‌మెంట్ ఖరారు చేసింది.
ఇదీ చదవండి
AP Govt On PRC: ప్రభుత్వ ఉద్యోగులకు 23.29 శాతం ఫిట్‌మెంట్