కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ చట్టాల రద్దు (farm laws repeal) నిర్ణయం రైతుల పోరాటానికి నిదర్శనమని పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ అన్నారు. రైతులతో పాటు కాంగ్రెస్ నాయకులు సోనియా, రాహూల్, ప్రియాంక గాంధీ పోరాట పఠిమ వల్లే వ్యవసాయ చట్టాలు వెనక్కి వెళ్లాయన్నారు. అనాడు దేశ రక్షణ కోసం ఇందిరా గాంధీ పని చేస్తే..ఈనాడు దేశ ప్రజలను పీక్కుతినేలా ప్రధాని మోదీ వ్యవహరిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు.
ప్రజా మద్దతుతో రైతుల విజయం
వ్యవసాయ చట్టాల రద్దు ప్రకటన హర్షించదగ్గ విషయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. దీర్ఘకాలంగా రైతులు చేస్తున్న ఉద్యమానికి ప్రజలు మద్దతు పలికారని..ప్రజల మద్దతు పొందిన ఏ ఉద్యమమైనా విజయం సాధిస్తుందన్నారు. ఇటీవల కొన్ని రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలపై రైతు ఉద్యమ ప్రభావం భాజపాపై తీవ్రంగా పడిందన్నారు. రాబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ప్రతికూల ఫలితాల నుంచి బయటపడేందుకు ప్రధాని మోదీ వ్యూహాత్మకంగా మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేశారని సామాజిక విశ్లేషకులు లక్ష్మీనారాయణ అన్నారు.