‘రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ తక్షణమే టీకాలు వేస్తేనే, కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు అవకాశం ఉంటుంది. ప్రజలు తమ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నారు. సీఎం మాత్రం దీనిని చిన్న అంశంగా తీసుకోవడం వల్లే పరిస్థితి ఇంతవరకు వచ్చింది. ఇకనైనా కట్టడికి తగిన నిర్ణయాలు తీసుకోవాలి’ అని విపక్ష పార్టీల నేతలు డిమాండ్ చేశారు. పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ ఆధ్వర్యంలో తెదేపా, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ నేతలు ఆదివారం వర్చువల్ సమావేశంలో పాల్గొని రాష్ట్రంలో కరోనా వ్యాప్తిపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై చర్చించారు.
లాక్‌డౌన్ అవసరం
సీఎం జగన్ దీనిని తొలుత పారాసిట్మాల్, బ్లీచింగ్ అంటూ మొదలు పెట్టి, సీరియస్‌గా తీసుకోలేదు. డబ్బులు కడతాం, మాకు వ్యాక్సిన్ కావాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నమే చేయలేదు. ఈ చెయిన్‌ను ఆపాలంటే లాక్‌డౌన్ అవసరం. ఈ సీఎం ఎవరితో మాట్లాడరు. ప్రతిపక్షాల అభిప్రాయాలు తీసుకోరు. 300-400 మంది సలహాదారులు ఉన్నారు. వారికి లక్షల జీతాలు ఇస్తున్నారు. కరోనాతో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.5-10 లక్షలు పరిహారంగా ఇవ్వాలి. ఇంజినీరంగ్ కళాశాలల్లో పడకలు ఏర్పాటు చేసి, ఆక్సిజన్ సదుపాయం కల్పిస్తే ఇంత ఇబ్బందులు ఉండేవి కాదు.
- అచ్చెన్నాయుడు, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు
సీఎం ప్రాధాన్యం ఇవ్వలేదు
15 నెలల తర్వాత కూడా సీఎం కొవిడ్‌కు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. గతవారం గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్‌నెట్ సదుపాయంపై సీఎం సమీక్ష జరిపారు. తన సొంత ఎజెండాలు పక్కనపెట్టి ప్రజల ప్రాణాలు, ఆరోగ్యం కాపాడడమే ఎజెండాగా సీఎం పనిచేయాలి. నీకే డబ్బులిస్తాం వ్యాక్సిన్ తీసుకురా.. అంటూ మంత్రి కొడాలి నాని సిగ్గులేకుండా చంద్రబాబుకు సవాల్ విసురుతున్నారు. ప్రైవేటు టీచర్లు, లెక్చరర్లకు, దుకాణాల్లో పనిచేసే వారికి నెలకు రూ.10 వేలు చొప్పున ఇవ్వాలి
- రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం పోరాడాలి
ఈ సమయంలో సీఎం, ప్రధానికి మద్దతు ఇచ్చేలా వ్యవహరించడం సరికాదు. కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం పోరాడాలి. అన్నిపార్టీల మద్దతు తీసుకోవాలి. కరోనా మొదటి, రెండో విడతకు మధ్య 5 నెలల సమయం ఉంటే, మోదీ దానిని రాజకీయాలకు వాడుకున్నారు. ఎన్నికల్లో గెలుపుపైనే దృష్టిపెట్టి, ప్రజల ఆరోగ్యాన్ని మరచిపోయారు. టీకాలకు కేంద్రం, రాష్ట్రం, ప్రైవేటుకు వేర్వేరు ధరలు ఏమిటి? అసంఘటిత రంగ కార్మికులకు నెలకు రూ.7,500, 25 కేజీల బియ్యం చొప్పున ఆరు నెలలు అందజేయాలి
- మధు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి
ఈ సమయంలో కక్ష సాధింపులా?