తమ డిమాండ్ల సాధనకు తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాలు తలపెట్టిన తెలంగాణ బంద్ కొనసాగుతోంది. ఆర్టీసీ ఐకాసతో పాటు వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు మద్దతుగా ఆందోళనలో పాల్గొంటున్నాయి. సమ్మెను విజయవంతం చేసేందుకు కార్మికసంఘాలు, విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. సమ్మెను నిలువరించేందుకు పోలీసులు విశ్వప్రయత్నం చేస్తున్నారు.
విపక్షనేతల అరెస్ట్...
జేబీఎస్ వద్ద శాంతియుతంగా ధర్నా చేస్తున్న తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాంతోపాటు పలువురు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ తెదేపా అధ్యక్షుడు ఎల్.రమణ, రావుల చంద్రశేఖర్‌రెడ్డి సహా మోత్కుపల్లి నర్సింహులును అరెస్ట్ చేసి లాలాగూడ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ గృహనిర్బంధం చేశారు. పీఓడబ్ల్యూ నాయకురాలు సంధ్యతోపాటు ప్రజా సంఘాల నేతల్ని సైతం ఎక్కడికక్కడ అదుపు చేస్తున్నారు.
తెలంగాణలో కొనసాగుతున్న ఆందోళనలు... అరెస్టులు న్యూడెమోక్రసీ నేత పోటుకు గాయాలు...
గోల్కొండ చౌరస్తా నుంచి వామపక్షాల నేతలు ర్యాలీగా బయలుదేరారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్డులో నిరసనకు దిగారు. న్యూడెమోక్రసీ నేత పోటు రంగారావును అరెస్ట్ చేసేక్రమంలో వేలికి గాయమైంది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ప్రజా గాయకురాలు విమలక్కలను అదుపులోకి తీసుకున్నారు. మగ్దూంభవన్ నుంచి ర్యాలీగా బయలుదేరిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డితోపాటు నాయకులను అరెస్ట్ చేశారు.
బస్‌భవన్ వద్ద భారీ బందోబస్తు
ఆర్టీసీ కార్మికుల బంద్ నేపథ్యంలో బస్ భవన్ వద్ద భారీగా పోలీసులను మోహరించారు. ఆందోళన కారులను నియంత్రించేందుకు ప్రవేశ ద్వారం ఎదుట బారికేడ్లతోపాటు, సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఆర్టీసీ క్రాస్ రోడ్డులో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలీసులు సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు.
బస్సులపై రాళ్లదాడి
నిజామాబాద్ జిల్లాలో రెండు చోట్ల బస్సులపై నిరసనకారులు దాడులకు తెగబడ్డారు.ఆచన్‌పల్లి, ముజారక్‌నగర్‌లో బస్సులపై నిరసనకారులు రాళ్లు రువ్వారు. ఈ దాడిలో రెండు బస్సుల అద్దాలు ధ్వంసమయ్యాయి. మరోవైపు వనపర్తిలోనూ ఆందోళకారులు బస్సుపై రాళ్లు రువ్వారు. పోలీసు బందోబస్తు నడుమ బయటకి వచ్చిన బస్సుపై రాళ్లదాడికి తెగబడ్డారు.
తెలంగాణలో కొనసాగుతున్న ఆందోళనలు... అరెస్టులు నాగోలు బండ్లగూడ డిపో వద్ద ఉద్ధ్రిక్తత
రాష్ట్ర బంద్ నేపథ్యంలో హైదరాబాద్‌లోని నాగోల్ బండ్లగూడ డిపో వద్ద ఉద్ధ్రిక్తత చోటు చేసుకుంది. డిపో నుంచి బయటకు వెళ్తున్న బస్సులను కార్మికులు అడ్డుకున్నారు. రెండు బస్సుల టైర్లలో గాలి తీసి, డీజిల్ ట్యాంక్ పగలగొట్టారు. దీంతో పోలీసులు కల్పించుకొని పరిస్థితిని చక్కదిద్దారు.
తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సమ్మె నడుస్తోంది. బస్సులు ఎక్కువ మొత్తం డిపోలకే పరిమితం అయ్యాయి. పలుచోట్ల ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి. నిరసనకారులు బస్సులకు గాలి తీస్తున్నారు. డ్రైవర్లపై దాడులకు పాల్పడుతున్నారు. ఇప్పటివరకూ కేవలం పదుల సంఖ్యలోనే బస్సులు నడిచాయి.
ఇదీ చదవండి:తెలంగాణలో కొనసాగుతున్న బంద్.. పలువురు అరెస్ట్