ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విజయవాడలో ఎలక్ట్రికల్ బైక్ బ్యాటరీ పేలి ఒకరు మృతి - విజయవాడ లేటెస్ట్ అప్​డేట్స్

electric bike battery exploded
విజయవాడలో ఎలక్ట్రికల్ బైక్ బ్యాటరీ పేలుడు

By

Published : Apr 23, 2022, 10:37 AM IST

Updated : Apr 24, 2022, 4:34 AM IST

10:35 April 23

మంటల్లో చిక్కుకున్న శివకుమార్‌తో పాటు భార్య, ఇద్దరు పిల్లలు

విజయవాడలో శనివారం తెల్లవారుజామున విషాదం చోటుచేసుకుంది. ఛార్జింగ్‌లో ఉన్న విద్యుత్‌ బైకు బ్యాటరీ పేలి.. కుటుంబ యజమాని కోటకొంట శివకుమార్‌ (42) మృతిచెందారు. ఆయన భార్య హారతి (30), కుమార్తెలు బిందుశ్రీ (10), శశి (6)లకు తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దుర్గాపురం గులాబీతోటకు చెందిన శివకుమార్‌ ప్రైవేటు ఉద్యోగం చేస్తుంటారు. విద్యుత్‌ వాహనాలంటే ఆసక్తి ఉండటంతో గురువారం ‘కార్బెట్‌ 14’ ద్విచక్రవాహనాన్ని కొన్నారు. శుక్రవారం రాత్రి 10 గంటలకు బ్యాటరీని తీసి ఇంట్లోని ముందు గదిలో ఛార్జింగ్‌ పెట్టారు. లోపలి గదిలో పడుకున్నారు. తెల్లవారుజామున 3.30 సమయంలో బ్యాటరీ ఒక్కసారిగా పేలింది. దీంతో ఇంట్లో మంటలు చెలరేగాయి. బయటకు వచ్చే మార్గం వద్దే మంటలు ఏర్పడటంతో వారు తప్పించుకునే వీల్లేకుండా పోయింది. బ్యాటరీ పేలిన శబ్దానికి చుట్టుపక్కల వాళ్లు మేలుకొని... తలుపులు పగలగొట్టి, తీవ్ర గాయాలతో ఉన్న కుటుంబసభ్యులను బయటకు తీసుకొచ్చారు. వారిని ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా తీవ్రంగా గాయపడ్డ శివకుమార్‌ దారిలోనే మరణించారు. పిల్లలను రింగ్‌రోడ్డులోని చిన్నపిల్లల ఆస్పత్రికి, హారతిని గవర్నర్‌పేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.

పొగచూరిన ఇల్లు

బ్యాటరీ పేలిపోయి ఒక్కసారిగా మంటలు చెలరేగటంతో ఇల్లంతా పొగచూరి నల్లగా మారిపోయింది. ఫ్రిజ్‌, ఏసీˆ ఇతర ఉపకరణాలు కాలిపోయాయి. ఇంట్లోని వైరింగ్‌ కూడా కాలిపోయింది. బ్యాటరీ ఛార్జింగ్‌ పెట్టిన స్విచ్‌బోర్డు కాలిపోయింది. అగ్నిమాపక సిబ్బంది బెడ్‌రూం పక్కనే ఉన్న సిమెంటు కిటికీ పగలగొట్టి ఇంట్లోని పొగ బయటకు పోయేలా చేశారు. అనంతరం మంటలను అదుపు చేశారు. పేలిపోయిన బ్యాటరీ ముక్కలు ఇల్లంతా పడ్డాయి. ప్రమాదస్థలాన్ని విద్యుత్తుశాఖ ఏఈ శివారెడ్డి పరిశీలించారు. విద్యుత్తు వైరింగ్‌ లోపం లేదని గుర్తించి.. అనంతరం ఇంటికి విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించారు.

బ్యాటరీ లోపమే కారణమా?

కార్బెట్‌ 14 వాహనంలోని బ్యాటరీ లోపం వల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఇప్పటివరకు విజయవాడలో 2 వాహనాలనే విక్రయించారు. ఒకటి విజయవాడలో ఉండగా రెండోది మచిలీపట్నంలో ఉంది. దీన్ని వెంటనే వెనక్కి తెప్పిస్తున్నామని నెడ్‌క్యాప్‌ జిల్లా మేనేజర్‌ సత్యనారాయణ వెల్లడించారు. బ్యాటరీ తయారీదారులు దిల్లీ నుంచి రావాలని, వాళ్లు వచ్చాకే ప్రమాద కారణాలు తెలుస్తాయని అన్నారు. జరిగిన ఘటనపై సూర్యారావుపేట పోలీసులు కేసు నమోదుచేశారు.

ఇదీ చదవండి: ఆ పనులు వద్దన్నందుకు స్థానికులపై యువకుల దాడి

Last Updated : Apr 24, 2022, 4:34 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details