ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

tdp pulichintala tour: 'జలయజ్ఞంలో ధనయజ్ఞం వల్లే పులిచింతల గేటు కొట్టుకుపోయింది'

తెదేపా నేతల బృందం నేడు పులిచింతల డ్యామ్ పరిశీలనకు వెళ్లనుంది. ఈ మేరకు తెదేపా శాసనసభ పక్ష ఉపనేత, పొలిట్ బ్యూరో సభ్యులు నిమ్మల రామానాయుడు ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే గేటు ఊడిపోయి.. నీరు వృథాగా సముద్రంలో కలిసిపోతుందని నేతలు మండిపడ్డారు.

tdp visit pulichintala project
తెదేపా నేతల బృందం పులిచింతల ప్రాజెక్టు సందర్శన

By

Published : Aug 6, 2021, 9:16 PM IST

Updated : Aug 7, 2021, 12:59 AM IST

జలాశయాలపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం చేస్తుందని.. అందువల్లే పులిచింతల ప్రాజెక్టు గేటు ఊడిపోయిందని తెలుగుదేశం పార్టీ నేతలు పేర్కొన్నారు. తెదేపా నేతల బృందం.. నేడు పులిచింతల ప్రాజెక్టు పరిశీలనకు వెళ్లనుంది. ఈ మేరకు తెదేపా శాసనసభ పక్ష ఉపనేత, పొలిట్ బ్యూరో సభ్యులు నిమ్మల రామానాయుడు ఓ ప్రకటన విడుదల చేశారు.

దివంగత వైఎస్ హయాంలో జలయజ్ఞం పేరిట చేసిన ధనయజ్ఞం కారణంగానే పులిచింతల ప్రాజెక్టు గేటు ఊడిపోయిందని నిమ్మల రామానాయుడు ఆరోపించారు. "ప్రాజెక్టుల నిర్వహణను జగన్ రెడ్డి పట్టించుకోకపోవడం వల్లే గేటుకు సాంకేతిక సమస్య తలెత్తి ఊడిపోయింది. దివంగత వైఎస్​కు సన్నిహితంగా ఉండే కాంట్రాక్టు సంస్థకు పులిచింతల ప్రాజెక్టు పనులు అప్పగించారు. ధనయజ్ఞం బయటపడేసరికి తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావుకు చెందిన కాంట్రాక్టు సంస్థ అంటూ జగన్ రెడ్డి తన సొంత మీడియాలో అసత్యాలు ప్రచారం చేయిస్తున్నారు. జగన్ రెడ్డి, బెట్టింగ్ మంత్రి అవగాహన లేమితోనే పులిచింతల గేటు కొట్టకపోయింది" అని ఓ ప్రకటనలో ఆక్షేపించారు.

జగన్​ పాలనలో ఆ రెండూ ఎక్కువే.. : అయ్యన్న

వైకాపా పాలనలో అవినీతి, ఆరాచకం రెండూ ఎక్కువేనని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు అయ్యన్నపాత్రుడు ధ్వజమెత్తారు. జ‌గ‌న్ పాలనలో డ్యాంలు నిండినా.. చుక్కనీరు వాడుకోవడానికి ప‌నికిరాదని దుయ్యబట్టారు. 'క‌ర్నూలు న్యాయ‌ రాజ‌ధాని అన్నాడు.. రాష్ట్రం క‌రోనా క‌ల్లోలంలో చిక్కింది. విశాఖ ప‌రిపాల‌నా రాజ‌ధానిగా ప్రక‌టించగానే ఎల్జీ పాలీమ‌ర్స్‌, సాయినార్, హెచ్పీసీఎల్‌, షిప్‌యార్డ్ ప్రమాదాల‌లో వంద‌ల మంది చనిపోయారు. దుర్గమ్మకి చీర‌ స‌మ‌ర్పించేందుకు వెళ్తే కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డటం, కచ్చులూరు బోటు ప్రమాదంలో 60 మంది చనిపోయారు అని అయ్యన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదంతా ఎవరి పాదం వల్ల జరిగిందో మంత్రి అనిల్‌ చెప్పాలని అయ్యన్న డిమాండ్ చేశారు.

పులిచింత‌ల అవినీతిపై విచార‌ణ జ‌రిపితే అవినీతి చేయించిన మ‌హామేత లేకపోయినా.. చేసిన యువ‌మేత ఉన్నందున అడ్డంగా దొరుకుతాడని ఎద్దేవా చేశారు. ప్రభుత్వంలో ఉండి అన్నింటికీ చంద్రబాబే కార‌ణ‌మ‌ని చెప్పడానికి క‌నీసం సిగ్గు ప‌డ‌టం లేదని విమర్శించారు. చంద్రబాబు తెచ్చిన కియా మీరే తెచ్చార‌ని స‌భ‌లో నిస్సిగ్గుగా ఉత్తరం చ‌దువుతారని.. పులివెందుల పుల‌కేశీల పాపం పులిచింత‌లకి శాప‌మైతే చంద్రబాబుపై ఏడుపెందుకు అని దుయ్యబట్టారు.

జలాశయాల నిర్వహణ గాలికొదిలేశారు: ఆలపాటి

ముఖ్యమంత్రి జగన్ రెడ్డి.. రాష్ట్రంలోని జలాశయాల నిర్వహణ గాలికొదిలేశారని మాజీమంత్రి ఆలపాటి రాజా మండిపడ్డారు. పులిచింతల నిర్మాణ దశలోనే లోపాలను తెదేపా అధినేత చంద్రబాబు ఎత్తి చూపితే నాటి అప్పటి సీఎం దివంగత రాజశేఖర్ రెడ్డి లెక్కచేయలేదని ఆలపాటి విమర్శించారు. గేట్ల సంఖ్యను 33నుంచి 24కు కుదించటంతోపాటు స్పిల్ వే 550 మీటర్లకు తగ్గింపునూ తప్పుబట్టినా వైఎస్ పట్టించుకోలేదని దుయ్యబట్టారు. ఆ ఫలితంగానే నేడు గేటు కొట్టుకుపోయిందన్నారు. ప్రాజెక్టు నిర్మాణ సంస్థ గురించి జగన్ రెడ్డి తన సొంత మీడియా ద్వారా అసత్యాలు ప్రచారం చేయిస్తున్నారని ఆలపాటి ధ్వజమెత్తారు. పులిచింతల పర్యటనకు వెళ్లిన ముగ్గురు మంత్రులు సాధించింది ఏమీలేదని విమర్శించారు.

పొలవరం గాలికి.. పులిచింతల నీటికి : జవహర్

పులిచింతల ప్రాజెక్టులో ఊడిన గేటు ఏర్పాటుపై దృష్టి సారించకుండా నిందలతో మంత్రి అనిల్​ కాలక్షేపం చేస్తున్నారని.. మాజీమంత్రి జవహర్ విమర్శించారు. పొలవరం గాలికి, పులిచింతలను నీటికి వదిలేసి పాదముద్రలతో రాష్ట్రానికి నరకం చూపిస్తున్నారని మండిపడ్డారు. పంట విరామం ఎవరి పాలనలో వచ్చిందో మంత్రి అనిల్ సమాధానం చెప్పాలన్నారు.

ఇదీ చదవండి..

విశాఖలో కేంద్ర ఆర్థికమంత్రి​ పర్యటన.. కార్మిక సంఘాల నేతల ముందస్తు అరెస్ట్​

Last Updated : Aug 7, 2021, 12:59 AM IST

ABOUT THE AUTHOR

...view details