తెలంగాణలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా మరో 12 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఫలితంగా ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 79కి చేరింది. 24 గంటల వ్యవధిలో ఎట్ రిస్క్ దేశాల నుంచి 123 మంది శంషాబాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి (ఆర్‌జీఐఏ) చేరుకున్నారు. వారందరికీ కొవిడ్ ఆర్‌టీ-పీసీఆర్ టెస్టులు చేయగా 10 మంది ప్రయాణికులకు పాజిటివ్‌గా తేలింది. దీంతో అధికారులు వారి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌కి పంపించారు.
కోలుకున్న 27మంది బాధితులు..
ఇప్పటివరకు ఎట్ రిస్క్, నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన 12,692 మంది ప్రయాణికులకు ఆర్‌జీఐఏలో కొవిడ్ ఆర్‌టీ-పీసీఆర్ పరీక్షలు చేశారు. వారిలో 144 మందికి కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. వారందరి శాంపిల్స్‌ని అధికారులు జీనోమ్ సీక్వెన్సింగ్‌కి పంపించారు. వారిలో 44 మందికి ఒమిక్రాన్ నెగిటివ్‌గా తేలింది. మిగిలిన 100 మందిలో ఇప్పటివరకు 79 మందికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మరో 21 మంది ఫలితాలు రావాల్సి ఉందని వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. చికిత్స అనంతరం ఒమిక్రాన్ బాధితుల్లో 27 మంది కోలుకున్నారు.