OMICRON CASE IN AP :ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న ఒమిక్రాన్ రాష్ట్రంలోకి వచ్చేసింది. తొలి ఒమిక్రాన్ కేసు నమోదైనట్లు వైద్యశాఖ అధికారికంగా ప్రకటించింది. 34 ఏళ్ల యువకుడికి వేరియంట్ నిర్ధారణ అయింది. బాధితుడు ఆరోగ్యవంతంగా ఉండడం యంత్రాంగానికి ఊరటనిస్తోంది. విదేశాల నుంచి వచ్చిన ఆ యువకుడిని కలిసిన వారికీ వైద్యపరీక్షలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఇతర దేశాల నుంచి వస్తున్న ప్రయాణికులపై నిఘా పెంచారు.
ఐర్లాండ్ నుంచి ముంబయి మీదుగా వచ్చిన విజయనగరం జిల్లా వాసిలో ఒమిక్రాన్ నిర్ధారణ అయింది. రాష్ట్రంలో ఇదే తొలి ఒమిక్రాన్ కేసు. 34 ఏళ్ల యువకునికి వేరియంట్ సోకినట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటనలో తెలిపింది. ఆ యువకుడు ఐర్లాండ్ నుంచి ముంబయి మీదుగా విశాఖకు వచ్చారు. విమానాశ్రయంలో ఆర్టీపీసీఆర్ పరీక్ష నిర్వహించగా కరోనా నిర్ధారణ అయింది. అతని నమూనాను జీనం సీక్వెన్సింగ్ కోసం హైదరాబాద్‌లోని సీసీఎంబీకి పంపించారు. పరీక్షల్లో ఒమిక్రాన్‌గా తేలినట్లు ప్రజారోగ్యశాఖ సంచాలకులు డాక్టర్ హైమావతి వెల్లడించారు. బాధితుడు ఆరోగ్యంగా ఉన్నారని....ఈనెల 11న మరోసారి ఆర్టీపీసీఆర్ ద్వారా పరీక్ష చేయగా నెగెటివ్ రిపోర్టు వచ్చిందని పేర్కొన్నారు. దీనిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. బాధితుడు ప్రథమ, ద్వితీయ కాంటాక్టు వ్యక్తులు సుమారు 40 మంది వరకు ఉన్నట్లు గుర్తించి వారికీ పరీక్షలు చేయగా...అందరికీ నెగెటివ్ వచ్చినట్లు తెలిపారు. విదేశాల నుంచి తిరుపతికి చేరిన మరొకరికి ఇటీవల చేసిన పరీక్షలో పాజిటివ్ వచ్చినట్లు ఆదివారమే ఖరారైంది. ఇతను ఆరోగ్యంగానే ఉన్నారని...మరో ఒమిక్రాన్ కేసు నమోదైనట్లుగా జరుగుతోన్న ప్రచారంలో వాస్తవం లేదని ప్రజారోగ్య సంచాలకులు పేర్కొన్నారు.
16 మందికి పాజిటివ్
విదేశాల నుంచి రాష్ట్ర చిరునామాతో 15వేల714 మంది వచ్చారని... వీరిలో కొందరు రాష్ట్రానికి రాగా.. మరికొందరు హైదరాబాద్,చెన్నై తదితర ప్రాంతాలకు వెళ్లినట్లు అధికారులు తెలిపారు. వారిలో 12వేల969 మంది వివరాలను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సేకరించారు. వీరికి చేసిన ఆర్టీపీసీఐర్ టెస్టుల ద్వారా 16 మందికి పాజిటివ్ వచ్చినట్లు తేలింది. అమెరికా, ఐర్లాండ్, దక్షిణాఫ్రికా, సింగపూర్, యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి వచ్చిన వారిలో కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. విదేశాల నుంచి వచ్చిన వారిలో అనంతపురం జిల్లాలో మూడు, విజయనగరం -ఒకటి, శ్రీకాకుళంలో ఒకటి, కృష్ణా జిల్లాలో రెండు, కడపలో ఒకటి, నెల్లూరులో ఐదు, గుంటూరు జిల్లాలో ఇద్దరు, తిరుపతిలో ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చింది.