పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు వెళ్లిన అభ్యర్థులకు మెుదటి రోజు నిరాశే ఎదురైంది. ఎన్నికలపై తమకెలాంటి సమాచారం లేదని, ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాలేవని కార్యాలయ అధికారులు చెప్పారు. కొన్నిచోట్ల నిర్ణీత సమయానికి కార్యాలయాలనే తెరవలేదు. సిబ్బంది అందుబాటులో లేరు. తమ మద్దతుదారులతో వచ్చిన తెదేపా, జనసేన, భాజపా నేతల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం తక్కెళ్లపాడులో మాత్రం ఇద్దరినుంచి నామినేషన్లను స్వీకరించి.. మళ్లీ తిరిగిచ్చి.. ఆనక తీసుకున్నారు. చివరకు రద్దు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్ తలుపులు ఉదయం 11 గంటలకూ తెరచుకోలేదు.
* నామపత్రాల విషయమై పశ్చిమగోదావరి జిల్లా భీమడోలులో తెదేపా మద్దతుదారులు, పంచాయతీ సిబ్బంది మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీనిపై ఆగ్రహిస్తూ భీమడోలు మండలపరిషత్ కార్యాలయం వద్ద తెదేపావారు ఆందోళన చేశారు. నల్లజెర్ల మండలంలోని గంటావారిగూడెం, ఏలూరు గ్రామీణ మండలం వట్లూరు, చింతలపూడి మండలం సీతానగరంలో తెదేపా మద్దతుదారులు నామినేషన్ వేయడానికి వెళ్లగా అధికారులు అందుబాటులో లేరు.
* కృష్ణా జిల్లా గన్నవరంలో సీపీఎం నాయకులు ఎంపీడీఓ కార్యాలయానికి వచ్చి నామినేషన్లు తీసుకుంటున్నారో లేదోనని వాకబు చేశారు. రెడ్డిగూడెం పంచాయతీకి నామినేషన్ వేసేందుకు తమ మద్దతుదారులతో కలిసి వెళ్లిన తెదేపా నేతలకూ నిరాశే ఎదురైంది.
* విశాఖ జిల్లా పరవాడలో నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లుచేయాలని మాజీ ఎంపీపీ అప్పారావు ఎంపీడీఓకు విన్నపమిచ్చారు. నామపత్రాలు ఇవ్వడం లేదని, ఎన్నికలకు ఏర్పాట్లు చేయడం లేదని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి కుమారుడు అప్పలనాయుడు పెందుర్తి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
* నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం ఎంపీడీఓ కార్యాలయంలో నామినేషన్ వేసేందుకు మద్దతుదారులతో కలిసి తెదేపావారు వచ్చారు. పత్రాలివ్వాలని అధికారుల్ని కోరగా.. తమకు అందలేదని ఎంపీడీవో తెలిపారు. ఓటర్ల జాబితానైనా ఇవ్వాలని కోరగా.. అవీ సిద్ధంగా లేవని చెప్పారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదమేర్పడింది. రాపూరు మండలంలో సచివాలయాల్లో నామినేషన్లు వేసే అవకాశం లేకపోవడంపై తెదేపా నాయకులు ఎంపీడీవోను కలిసి ప్రశ్నించారు. వెంకటాచలం మండలంలోనూ నామినేషన్లు వేయడానికి అవకాశం లేక తెదేపా మద్దతుదారులు వెనుదిరిగారు.
* తెదేపాకు చెందిన మట్టా రాధ తూర్పుగోదావరి జిల్లా రాజోలు పంచాయతీకి నామినేషన్ వేయడానికి ఎండీపీఓ కార్యాలయానికి వెళ్లారు. అధికారులు ఆమెను వెనక్కి పంపారు. ఎంపీడీఓ కార్యాలయం వద్ద గొల్లపల్లి సూర్యారావు ఆందోళన చేశారు. ఉప్పలగుప్తం పంచాయతీ కార్యాలయానికి నామినేషన్ వేసేందుకు తెదేపా మద్దతుదారులు వెళ్లినా, ఉత్తర్వులు రాలేదనడంతో వెనుదిరిగారు. నామినేషన్లు స్వీకరించడం లేదంటూ ఆత్రేయపురం మండలం అంకంపాలెం పంచాయతీ కార్యాలయం వద్ద అభ్యర్థులుగా పోటీ చేసేందుకు వచ్చినవారు ఆందోళన చేశారు. అధికారుల తీరును నిరసిస్తూ అమలాపురంలో జనసేన, భాజపా నేతలు అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు.
* అనంతపురం జిల్లా లేపాక్షిలో స్థానిక న్యాయవాది గంగాధర్ నామినేషన్‌ను సిబ్బంది తీసుకోలేదు. మడకశిర మండలం బుక్కసముద్రంలో జయపాల్‌కూ నిరాశే ఎదురైంది. రోళ్ల, సోమందేపల్లి పంచాయతీలకు, పెనుకొండ మండలంలోని గ్రామాల్లోనూ నామపత్రాలివ్వలేదు.