విశాఖపట్నం జిల్లా రాంబిల్లి మండలంలో ముంపునకు గురైన పంటపొలాలను జిల్లా కలెక్టర్ వి.వినయ్‌చంద్ పరిశీలించారు. రజాల గ్రామంలో జరిగిన నష్టాన్ని వ్యవసాయ అధికారులతో కలసి పరిశీలించి రైతులతో మాట్లాడారు. శారదా నది ముంపు నివారించేందుకు పటిష్ఠ చర్యలు చేపడతామని రైతులకు హామీ ఇచ్చారు. నర్సీపట్నం సబ్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య నాతవరం మండలంలోని జిల్లేడుపూడి గ్రామాన్ని సందర్శించి...వర్షాలకు దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించారు. బాధితులతో మాట్లాడి దెబ్బతిన్న గృహాలకు త్వరగా పరిహారం ఇప్పించే ప్రయత్నం చేస్తామన్నారు.
విజయనగరం జిల్లాలో భారీవర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలను జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ పరిశీలించారు. గొల్లలపాలెం గ్రామంలో వ్యవసాయ అధికారులతో కలసి పర్యటించి వరి పొలాలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి పంటనష్టంపై ఆందోళన చెందొద్దని ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసానిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు ఉంగుటూరు మండలం కైకరం, బాదంపూడి గ్రామాల్లో పర్యటించి భారీవర్షాల కారణంగా ముంపునకు గురైన పంటపొలాలను, ఎన్యూమరేషన్ జరుగుతున్న విధానాన్ని పరిశీలించారు. రైతులతో మాట్లాడి నష్టపోయిన రైతులందరికీ పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు.
కృష్ణా జిల్లాలో భారీ వర్షాలకు, కృష్ణా నదికి సంభవించిన వరదల కారణంగా కంచికచర్ల, నందిగామ, చందర్లపాడు మండలాల్లోని పలు గ్రామాల్లో దెబ్బతిన్న ఇళ్లను జిల్లా జాయింట్ కలెక్టర్ కె.మాధవీలత, విజయవాడ సబ్ కలెక్టర్‌తో కలసి పరిశీలించారు. పంటలకు, ఇళ్లకు జరిగిన నష్టాన్ని అంచనా వేశామని, ప్రభుత్వానికి నివేదికలు పంపిస్తున్నట్టు వివరించారు. ఇప్పటికే 27 మండలాల్లో వరద బాధితులకు నిత్యావసర సరుకులు అందజేశామన్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం, సోంపేట మండలాల్లో జిల్లా కలెక్టర్ జె.నివాస్ పర్యటించి పంటనష్టాన్ని పరిశీలించారు. నష్టాన్ని అంచనావేసి ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు.