సాధారణ కుటుంబాలకు చెందిన బీటెక్ విద్యార్థులు చదువు పూర్తయ్యిందో లేదో ఐటీ కంపెనీల్లో భారీ వేతనాలతో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఫలితంగా వారి కుటుంబాల ఆర్థిక పరిస్థితి మారిపోనుంది. ప్రొడక్ట్ కంపెనీలు కొత్త సాఫ్ట్‌వేర్లను అభివృద్ధి చేస్తాయి. ఉదాహరణకు మైక్రోసాఫ్ట్, ఒరాకిల్, ఐబీఎం లాంటి సంస్థలు అత్యంత ప్రతిభావంతులను గుర్తించి భారీ వేతనాన్ని ఆఫర్ చేస్తున్నాయి. రెండు మూడు సంవత్సరాలుగా కోడింగ్ సత్తా ఉంటేచాలు ఏ కళాశాల విద్యార్థి అయినా మంచి ఆఫర్లను అందుకుంటున్నారు. పలు కంపెనీలు నిర్వహించే కోడింగ్ పోటీలు మెరిట్ విద్యార్థులకు ఊతమిస్తున్నాయి.
మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం వెంకటగిరికి చెందిన ఇతడి పేరు రిషికుమార్‌రెడ్డి. సాధారణ వ్యవసాయ కుటుంబానికి చెందిన కుర్రాడు. కష్టపడి ఎంసెట్‌లో 4,200 ర్యాంకు పొందిన రిషి హైదరాబాద్‌లోని గోకరాజు రంగరాజు కళాశాలలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదువుతున్నాడు. ఇటీవల అమెజాన్ సంస్థలో రూ.33 లక్షల వార్షిక వేతన కొలువుకు ఎంపికయ్యాడు. బీటెక్ మూడో ఏడాది నుంచే డేటా స్ట్రక్చర్స్, అల్గారిథమ్స్‌ను ఉపయోగించి ప్రాబ్లెమ్ సాల్వింగ్‌పై సాధన చేయడం ఆ అబ్బాయికి లాభించింది.
తెలుగు రాష్ట్రాల నుంచి 300 మంది!
ఏపీ, తెలంగాణ నుంచి రూ.20 లక్షలు, ఆపైన వార్షిక వేతనంతో ఎంపికైన వారు దాదాపు 250-300 మంది ఉంటారని అంచనా. తెలంగాణలోని వీఎన్‌ఆర్ విజ్ఞానజ్యోతిలోనే 30 మంది, సీబీఐటీలో 20, వాసవిలో 23 మంది, నారాయణమ్మలో 20 మంది వరకు ఎంపికయ్యారు. గోకరాజు రంగరాజులో ముగ్గురు, ఓయూ ఇంజినీరింగ్ కళాశాల నుంచి ఇద్దరు భారీ ప్యాకేజీలను అందుకున్నారు. ఇతర కళాశాలల్లో చదివిన మరికొందరూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయానికి చెందిన కె.సాయి రిష్వంత్ రూ.24 లక్షలు, కాట్రగడ్డ రితిక, వెంకటసాయి నిఖిత్‌లు రూ.29.50 లక్షల ప్యాకేజీతో అమెజాన్‌కు ఎంపికయ్యారు. కేఎల్ విశ్వవిద్యాలయానికి చెందిన భానురేఖ రూ.25 లక్షలతో సర్వీస్‌నౌ కంపెనీలో ఉద్యోగం పొందారు. విశాఖలోని గాయత్రి విద్యా పరిషత్ ఇంజినీరింగ్ కళాశాల నుంచి నలుగురు రూ. 31.25 లక్షల ప్యాకేజీకి, మరొకరు రూ. 28 లక్షల వేతనానికి అమెజాన్‌లో కొలువు సంపాదించారు.
ఏపీ ట్రిపుల్ ఐటీల్లోనూ..
ట్రిపుల్‌ఐటీల్లో చదువుతున్న పేద పిల్లలు కూడా ప్రాంగణ నియామకాల్లో మంచి ప్యాకేజీలను అందుకున్నారు. ఇడుపులపాయ నుంచి ముగ్గురు రూ.28 లక్షల ప్యాకేజీతో అమెజాన్‌లో ఉద్యోగాలు సంపాదించారు. అనంతపురం జిల్లాకు చెందిన ఆయేషా, బాలచంద్రారెడ్డి ట్రీపుల్‌ఐటీలకు ఎంపికై ఉత్తమ వేతన కొలువులు సాధించారు. నూజివీడు ట్రిపుల్‌ఐటీ నుంచి 10 మంది విద్యార్థులు బెంగళూరులోని అనలాగ్ డివైజెస్‌కు రూ.20 లక్షల ప్యాకేజీకి ఎంపికయ్యారు. వీరందరూ ప్రభుత్వ బడుల్లో చదివిన పేద కుటుంబాలకు చెందిన వారే కావడం విశేషం.
సగం మంది అమ్మాయిలే
తెలుగు రాష్ట్రాల్లో ఏటా 1.50 లక్షలమంది విద్యార్థులు బీటెక్‌లో చేరుతున్నారు. వారిలో దాదాపు 40 శాతం మంది అమ్మాయిలే. భారీ వేతనంతో ఎంపికవుతున్న వారిలో మాత్రం కనీసం వీరు సగం మంది ఉంటున్నారు. 'నిర్ణయాలు తీసుకోవడంలో మహిళలు కచ్చితత్వంతో ఉంటారు. నిజాయతీగా పనిచేస్తారు. తరచూ ఉద్యోగాలు మారరని పరిశ్రమలు నమ్ముతున్నాయి. అందుకే అమ్మాయిలకు పెద్దపీట వేస్తున్నాయని' ప్రాంగణ నియామకాల అధికారులు చెబుతున్నారు.
ఒక్కసారి కూడా తప్పని వారికే..
ఉద్యోగాల పోటీలో పాల్గొనాలంటే కనీసం 60 శాతం మార్కులు తప్పనిసరి. మరికొన్ని ఉత్పత్తి తరహా ప్రముఖ కంపెనీలు 70 శాతం మార్కులు ఉంటేనే రాత పరీక్షలకు, ముఖాముఖీలకు ఆహ్వానిస్తున్నాయి. ఉద్యోగాలకు ఎంపిక కావాలంటే కొన్ని నిబంధనలను పాటించాల్సి ఉండటంతో ఇంజినీరింగ్‌లో ప్రవేశించిన వారిలో సగం మందికి లోపే ఉద్యోగాలకు పోటీపడేందుకు అర్హత పొందుతున్నారని నిపుణులు విశ్లేషిస్తున్నారు. మైక్రోసాఫ్ట్, గూగుల్, ఫేస్‌బుక్, పెగా సిస్టమ్స్ లాంటి పలు సంస్థలు మూడో సంవత్సరం వరకు అన్ని సబ్జెక్టుల్లో ఉత్తీర్ణులై ఉండాలని, మూడేళ్లలో ఒక్కసారి కూడా తప్పి ఉండరాదని నిబంధనలు విధిస్తుంటాయి. కనీసం ప్రథమ శ్రేణి మార్కులు సాధిస్తేనే వడపోత పరీక్షలు రాయడానికి అనుమతి ఇస్తాయి.
ముందు ఇంర్న్‌షిప్.. తర్వాత కొలువు భారీ వేతన ప్యాకేజీతో ఎంపిక చేసుకుంటున్న కంపెనీలు ఎక్కువ శాతం ఆరు నెలలపాటు ఇంటర్న్‌షిప్ ఆఫర్ చేస్తున్నాయి. పనితీరు గమనించి ఉద్యోగంలోకి తీసుకుంటున్నాయి. నెలకు రూ.30 వేల నుంచి రూ.60 వేల వేతనం అందుతుంది. తర్వాత వారికి పూర్తిస్థాయిలో కొలువులు ఇస్తున్నాయి. 70-80 శాతమే ఎంపికవుతారని ప్రాంగణ నియామకాల అధికారులు చెబుతున్నారు. ప్రతిభ ఆధారంగా కొందరిని మాత్రం నేరుగా ఫుల్‌టైమ్ ఉద్యోగంలోకి తీసుకుంటున్నాయి.
అత్యధిక ప్యాకేజీలకు మూడేళ్ల ప్రణాళిక
బీటెక్ నాలుగో ఏడాది మొదటి సెమిస్టర్‌లోనే ప్రాంగణ నియామకాలు మొదలవుతాయి. అంటే మొదటి మూడేళ్లే కీలకం. నియామక స్థాయిని బట్టి కంపెనీలు 3 నుంచి 6 రౌండ్ల పరీక్షలు నిర్వహిస్తాయి. మొదటి రౌండు ఆప్టిట్యూడ్, ఆంగ్లం, ప్రోగ్రామింగ్ మీద జరుపుతారు. రెండో రౌండు నుంచి కోడింగ్ సామర్థ్యాన్ని పరీక్షిస్తాయి. రాత పరీక్షలు పూర్తయితే ముఖాముఖీలకు షార్ట్ లిస్టు చేస్తాయి. ఇంటర్వ్యూవర్‌కి లాజిక్ ఎలా ఉందనేది ముఖ్యం. అందుకు ఏ సంవత్సరంలో ఏం నేర్చుకోవాలో ప్రణాళిక వేసుకోవాలి.
-వెంకట్ కాంచనపల్లి, సన్‌టెక్ కార్ఫ్ సీఈఓ
మొదటి ఏడాది:ఇంజినీరింగ్ మొదటి సంవత్సరంలో సమస్య పరిష్కారశక్తి (ఆప్టిట్యూడ్), ఆంగ్లం (వర్బల్ ఎబిలిటీ)తోపాటు సీ/జావా/ఫైథాన్ లాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ల్లో ఒక దాంట్లో సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి.
రెండో ఏడాది: డేటా స్ట్రక్చర్స్‌పై పట్టు సాధించి కోడింగ్ సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకోవాలి. తొలుత సులభమైన ప్రాబ్లెం స్టేట్‌మెంట్లను పరిష్కరించాలి. అవకాశం ఉన్నపుడల్లా కంపెనీలు నిర్వహించే కోడింగ్ పోటీల్లో పాల్గొనాలి.