ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

"భౌ"బోయ్.. హైదరాబాద్​లో అన్ని లక్షల కుక్కలా!?

Street Dogs Problem in Hyderabad: చిన్న పిల్లలను బయటకు పంపాలంటే భయం.. ద్విచక్ర వాహనంపై వెళ్లాలన్నా.. ఎక్కడ వెంట పడి కరుస్తాయోనన్న హడల్‌. తెలంగాణలోని భాగ్యనగరంలో ఏ కాలనీలో చూసినా కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. శునకాల దాడుల్లో చిన్నపిల్లలే ఎక్కువ బాధితులుగా ఉంటున్నారు. వీధి కుక్కలను నియంత్రించడంలో జీహెచ్​ఎంసీ అధికారులు విఫలమవుతున్నారని నగరవాసులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

Street Dogs Problem in Hyderabad
హైదరాబాద్​లో 4 లక్షల 61 వేల కుక్కలు

By

Published : Jun 26, 2022, 2:10 PM IST

హైదరాబాద్​లో 4 లక్షల 61 వేల కుక్కలు

Street Dogs Problem in Hyderabad: తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌లోని పలు కాలనీల్లో వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. రోడ్డుపై ఆడుకుంటున్న పిల్లలను, బడికి వెళ్లివస్తున్న విద్యార్థులపై దాడులు చేస్తున్నాయి. అమీర్‌పేట్‌ ధరమ్‌కరమ్ రోడ్డులో ఓ పిచ్చి కుక్క చేసిన దాడిలో పదుల సంఖ్యలో విద్యార్థులకు గాయాలయ్యాయి. పగలు, రాత్రి అనే తేడా లేకుండా శునకాలు జనాలపైకి ఎగబడుతున్నాయి. చారిత్రక ప్రాంతం చార్మినార్‌లో కుక్కల బెడద అధికంగా ఉంది. దేశవిదేశీ పర్యాటకులు వచ్చే చోటా నిర్లక్ష్యం తాండవిస్తోంది. రైన్ బజార్ ప్రాంతంలో కొద్ది రోజుల కిందట మహిళపై కుక్కలు దాడి చేశాయి. ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడింది.

ముషీరాబాద్, రాంనగర్, విద్యానగర్, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్, గాంధీనగర్ ప్రాంతాల్లో వీధి కుక్కల సంచారం అధికంగా ఉంది. జీహెచ్​ఎంసీ అధికారులు పట్టించుకోవడంలేదని కాలనీ వాసులు వాపోతున్నారు. కూకట్‌పల్లి, కేపీహెచ్​బీ ప్రాంతాల్లో శునకాల సంఖ్య అధికంగా ఉంది. అల్పాహార కేంద్రాలు, చికెన్ సెంటర్ల వద్ద ఆహారం కోసం కాపలా కాస్తూ.. ఒకదానిపై ఒకటి దాడి చేసుకుంటూ ప్రజల మీదికి వస్తున్నాయి. వసతిగృహాల వద్ద కూడా వీధి కుక్కలు అధికంగా తర్చాడుతున్నాయి. కొద్ది రోజుల కిందట హైదర్‌నగర్‌ శ్రీనివాసకాలనీ 5ఏళ్ల బాలుడు దుకాణానికి వెళ్లివస్తున్న సమయంలో దాడి చేయగా.. ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేయాల్సి వచ్చింది. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో రోజురోజుకు కుక్కల బెడద పెరిగిపోతోంది.

ఎల్బీనగర్ నియోజకవర్గ పరధిలోని మన్సూరాబాద్ డివిజన్ పరిధిలో సౌత్ ఎండ్ పార్క్, డంపింగ్ యార్డ్ సమీపంలో.. ఆటోనగర్ పరిసప్రాంతాల్లో శునకాలు సంచరిస్తున్నాయి. వనస్థలిపురంలోని సాహెబ్‌నగర్, సామానగర్.. నాగోల్‌లోని జైపూర్ కాలనీ, ఫత్తులగూడాలో శునకాల బెదడ అధికంగా ఉంది. ఫత్తుల గూడలో ఉన్న యానిమల్ కేర్ సెంటర్‌కి తెచ్చిన శునకాలను... శస్త్ర చికిత్సలు చేసి అక్కడే వదిలిపెడుతున్నారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో శునకాలు విపరీతంగా సంచరిస్తున్నాయి.

గోల్కొండ పరిధిలోని బడాబజార్‌లో రెండేళ్ల బాలుడు అహ్మద్‌పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. గత నెలలో జియాగూడకు చెందిన 12ఏళ్ల బాలుడు మూసీ సమీపంలో ఆడుకుంటుండగా... శునకాలు మూకుమ్ముడిగా దాడి చేసి చంపేశాయి. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. సనత్‌నగర్, సికింద్రాబాద్, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోనూ శునకాల బెడద అధికంగా ఉంది. కుత్బుల్లాపూర్ మున్సిపల్ కార్యాలయం సమీపంలోనే కుక్కలు సంచరిస్తున్నా అధికారులు చర్యలు చేపట్టడం లేదు.

గ్రేటర్‌ హైదరాబాద్‌లో అధికారిక లెక్కల ప్రకారం మొత్తం 4 లక్షల 61 వేల 55 వీధి కుక్కలు ఉన్నాయి. ఇందులో స్టెరిలైజేష‌న్ చేసినవి 3లక్షలు కాగా.. స్టెరిలైజేషన్ చేయనివి 1.61 లక్షలు ఉన్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. కుక్కలు 8 నెలల వయసులోనే సంతానోత్పత్తి శక్తి కలిగి ఉండడం.. ఏడాదికి రెండు పర్యాయాలు సంతానోత్పత్తి చేసే అవకాశం ఉండడంతో వీటి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఒక కుక్క ఏడాదిలో 40కి పైగా పిల్లలకు జన్మనిస్తుంది. బస్తీల్లోని కుక్కలకు టీకా వేయడం, సంతాన నిరోధక శస్త్ర చికిత్సచేయాలనేది ప్రభుత్వ లక్ష్యంగా ఉన్నప్పటికీ.. ఆచరణలో అమలుకు నోచుకోవడం లేదు. ఫలితంగా ప్రజలు కుక్కకాటుతో రేబిస్ వ్యాధి బారిన పడుతున్నారు. హైదరాబాద్‌లోని ఐదు యానిమల్ కేర్ సెంటర్ల పరిధిలో.. సమగ్రంగా కుక్కల నియంత్రణ కోసం ఫైలెట్ ప్రాజెక్టు చేపట్టారు. శునకాల సమస్యలపై అధికారులు తీవ్రంగా దృష్టిసారించాలని భాగ్యనగరవాసులు కోరుతున్నారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details