ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ntr versity : ఎన్టీఆర్‌ వర్సిటీ డిపాజిట్ల జాబితాలో.. సర్కారు సంస్థ - NTR Health University latest news

ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి చెందిన నిధులను డిపాజిట్‌ చేసే బ్యాంకుల జాబితాలో ప్రభుత్వానికి చెందిన ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీఎస్‌ఎఫ్‌ఎస్‌సీఎల్‌)ను చేర్చాలని పాలకమండలి (ఈసీ) శనివారం తీర్మానం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను అనుసరించి ఈ నిర్ణయాన్ని ఆమోదించారు.

డిపాజిట్ల జాబితాలో ఏపీఎస్‌ఎఫ్‌ఎస్‌సీఎల్‌
డిపాజిట్ల జాబితాలో ఏపీఎస్‌ఎఫ్‌ఎస్‌సీఎల్‌

By

Published : Nov 14, 2021, 10:55 AM IST

విజయవాడలోని డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి చెందిన నిధులను డిపాజిట్‌ చేసే బ్యాంకుల జాబితాలో ప్రభుత్వానికి చెందిన ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీఎస్‌ఎఫ్‌ఎస్‌సీఎల్‌)ను చేర్చాలని పాలకమండలి (ఈసీ) శనివారం తీర్మానం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను అనుసరించి ఈ నిర్ణయాన్ని ఆమోదించారు. విశ్వవిద్యాలయం నిధులను ప్రభుత్వం తీసుకునేందుకు ప్రయత్నం చేస్తోందని ఉద్యోగ సంఘాల ఆందోళన నేపథ్యంలో పాలక మండలి సభ్యుల సమావేశాన్ని అత్యవసరంగా శనివారం నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వీసీ శ్యామ్‌ప్రసాద్‌ మాట్లాడుతూ.. ‘విశ్వవిద్యాలయానికి చెందిన మిగులు నిధులను ఏపీఎస్‌ఎఫ్‌ఎస్‌సీఎల్‌లో డిపాజిట్‌ చేయాలని మాకు ప్రభుత్వం నుంచి ఆదేశాలొచ్చాయి. ఈ సంస్థకు ఆర్‌బీఐ అనుమతి ఉంది. 21 రోజుల ముందు నోటీసులు ఇచ్చి నిధులను వెనక్కి తీసుకోవచ్చు. ప్రస్తుతం ఆరు జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్లు చేస్తున్నాం. వాటిల్లో కాలపరిమితి పూర్తయిన తర్వాత ఆ సమయంలో ఎవరు ఎక్కువ వడ్డీ రేటు ఇస్తే అక్కడ మళ్లీ డిపాజిట్లు చేస్తాం. ఈ ఆరు బ్యాంకుల సరసన ఏపీఎస్‌ఎఫ్‌ఎస్‌సీఎల్‌ని చేరుస్తూ పాలక మండలి సమావేశంలో తీర్మానించాం. మా డిపాజిట్ల కోసం నిర్వహించే బిడ్డింగ్‌లో పాల్గొనమని చెప్పాం.

బ్యాంకులు ఇచ్చే వడ్డీ రేటు కంటే ఎక్కువ ఇస్తామంటేనే డిపాజిట్‌ చేస్తాం...’ అని స్పష్టం చేశారు. రిజిస్ట్రార్‌ డాక్టర్‌ కె.శంకర్‌ మాట్లాడుతూ... ‘ఇది ప్రభుత్వ సంస్థ. ఏ రాజకీయ పార్టీకి సంబంధించినది కాదు. ఈ సంస్థకు ఇప్పటికే రూ.600 కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. ప్రస్తుతం వర్సిటీకి సంబంధించి రూ.450 కోట్ల నిధులున్నాయి. అందులో రాష్ట్ర విభజన చట్టం ప్రకారం రూ.220 కోట్లు తెలంగాణకు చెల్లించాల్సి ఉంది. కెనరా బ్యాంకు 5.1 వడ్డీ రేటు ఇస్తోంది. ఏపీఎస్‌ఎఫ్‌ఎస్‌సీఎల్‌ ఐదు శాతం ఇస్తామని పేర్కొంది. ఎక్కువ వడ్డీ వచ్చే వాటిని వదిలి రాలేం కదా! అంతకంటే ఎక్కువ వడ్డీ చెల్లిస్తేనే డిపాజిట్లు వేస్తాం....’ అని వెల్లడించారు. ఫైనాన్స్‌ సెక్రటరీ సత్యనారాయణ, హెల్త్‌ సెక్రటరీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ వర్చువల్‌ పద్ధతిలో పాల్గొన్నారు. డీఎంఈ రాఘవేంద్రరావు, పాలక మండలి సభ్యులు.. డాక్టర్‌ సుధాకర్‌, శరణ్‌సోని, భాగ్యలక్ష్మి, హేమలత, ఇండ్ల రామసుబ్బారెడ్డి, మల్లికార్జున్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ఉద్యోగ సంఘాల అభ్యంతరం..
ఎన్టీఆర్‌ విశ్వవిద్యాలయం నిధులను ప్రభుత్వానికి ఇవ్వడాన్ని ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ సమావేశానికి ముందు వీసిని కలిసి వినతిపత్రం ఇచ్చాయి. తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేశాయి. వీసీ, రిజిస్ట్రార్‌, పాలకమండలి సభ్యులు.. ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చించారు. డిపాజిట్‌ చేయమని ప్రభుత్వం సూచించిందని, తాము ఏం చేయగలమంటూ అధికారులు నిస్సహాయత వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ నిధులను డిపాజిట్‌ చేస్తే అవి తిరిగి వస్తాయా? అనే ఆందోళనే తమకు ఎక్కువగా ఉందని ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి.

ఇదీ చదవండి:

నేర అంగీకారపత్రంలో దస్తగిరి సంచలన విషయాలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details