వైద్య విద్య ప్రవేశ ప్రక్రియకు సంబంధించిన నోటిఫికేషన్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అధికారులు జారీ చేశారు. కొవిడ్ నేపథ్యంలో ఈసారి ప్రవేశాల ప్రక్రియ మొత్తం ఆన్‌లైన్‌లోనే నిర్వహించనున్నట్టు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ శంకర్ తెలిపారు. నీట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుతో పాటు తమ ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలను అప్‌లోడ్ చేయాలన్నారు. అభ్యర్థులు ఒక్కసారి దరఖాస్తు చేస్తే.. చివరి వరకు అన్ని విడతల కౌన్సెలింగ్‌కు అదే సరిపోతుందని తెలిపారు.
ప్రవేశాల ప్రక్రియలో భాగంగా తొలుత ఆల్ ఇండియా కోటా కింద ప్రభుత్వ వైద్య, దంత కళాశాలల్లో 15శాతం సీట్లను కేటాయించారు. ప్రస్తుతం ప్రభుత్వ కళాశాలల్లోని మిగతా 85శాతం, ప్రైవేటు కళాశాలల్లో కన్వీనర్ కోటా(ఎ కేటగిరి) కింద ఉండే 50శాతం సీట్లను భర్తీ చేయనున్నారు. ఇప్పటికే కన్వీనర్ కోటా సీట్ల వివరాలను విశ్వవిద్యాలయం ప్రకటించింది. అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈనెల 13వ తేదీ నుంచి 21 తేదీ సాయంత్రం 4గంటల్లోగా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
వికలాంగుల కేటగిరీ అభ్యర్థులు అంగవైకల్య పరీక్షలకు సంబంధించి విశ్వవిద్యాలయం నియమించిన ప్రత్యేక మెడికల్ బోర్డు ముందు ధ్రువీకరణ చేయించుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు, నిర్వహణ రుసుంగా ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.3540, ఎస్సీ, ఎస్టీ కేటగిరీలు రూ.2950 ఆన్‌లైన్‌లో చెల్లించాలని తెలిపారు .