కరోనా వైరస్ మహమ్మారి సృష్టించిన సంక్షోభంతో దేశవ్యాప్తంగా అన్ని రంగాలూ తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ప్రత్యేకించి వేర్వేరు పరిశ్రమలు, నిర్మాణ రంగంలో ఉపాధి వెతుకున్న వలస కూలీలు, కార్మికులు తిరిగి సొంత రాష్ట్రాలకు చేరుకున్నారు. ఆర్థికంగా చితికిపోయిన వారిని తిరిగి బలోపేతం చేసేందుకు వలస కార్మికులను ఉపాధి హామీ పథకంలో భాగస్వాములను చేసేందుకు కేంద్రం ఉపక్రమించింది. గరీబ్ కల్యాణ్ యోజన కింద వారికి ఉపాధి కల్పించేందుకు అవసరమైన జాబ్ కార్డులు సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ నుంచి సరైన పనులు లేక గ్రామీణ పేదలు సరైన ఆదాయం లేక కుటుంబాలు కూడా గడవని పరిస్థితుల్లోకి జారిపోయారు.
స్వస్థలాలకు 16 కోట్ల మంది..
ఎంతోమంది వలస కార్మికులు, చిరు వ్యాపారులు, రిక్షా కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు ఉపాధిని కోల్పోయి స్వగ్రామాలకు తిరుగుబాట పట్టారు. దేశవ్యాప్తంగా నిరుద్యోగం, జీవనోపాధి సమస్య గ్రామాలకు చేరుకుంది. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం అన్ని రాష్ట్రాల్లోనూ 16 కోట్ల మంది వరకూ ఉన్నట్లు అంచనా . ఆంధ్రప్రదేశ్ లోనూ ఈ సంఖ్య 20 లక్షల వరకూ ఉన్నా.. రాష్ట్రంలో మాత్రం అదనంగా 2020-21 ఆర్ధిక సంవత్సరానికి 5 లక్షల 33 వేల జాబ్ కార్డులు ఇచ్చినట్లు ప్రభుత్వం చెబుతోంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 67 లక్షల 21 వేల 960 జాబ్ కార్డులు ఉన్నాయి. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ఒక్కసారిగా కార్మికులు, కూలీలు తమ సొంత ఊళ్లకు వచ్చి చేరటంతో ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధి సమస్య ఒక్కసారిగా పెరిగిపోయింది. వీరిలో చాలామంది ఉపాధి పనులకే వెళ్తున్న దృశ్యాలు ప్రస్తుతం గ్రామాల్లో కనిపిస్తున్నాయి.
ఉపాధి పనులకు వెళ్లలెేని దుస్థితి..
ప్రస్తుతం రాష్ట్రంలో కొత్తగా 5 లక్షల పైచిలుకు జాబ్ కార్డులు ఇచ్చినప్పటికీ మరికొన్ని లక్షల మందికి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఎలాంటి జాబ్ కార్డులనూ జారీ చేయలేదు. దీంతో ఉపాధి హామీ పనులకు అర్హత కలిగినా జాబ్ కార్డులు లేని కారణంగా ఉపాధి పనులకు వెళ్లలేని దుస్థితి కారణంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వాస్తవానికి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పని పొందాలంటే జాబ్ కార్డు తప్పనిసరి అని చట్టం పేర్కొంటోంది. కొత్తగా వచ్చిన వారికి కొందరికి దీన్ని జారీ చేసినా.. వారిని బృందాలుగా ఏర్పాటు చేసి పని కల్పించాల్సి ఉంటుంది. ప్రస్తుతం జాబ్ కార్డులు ఇచ్చినా పనులు చూపించలేని పరిస్థితిలో పర్యవేక్షణ అధికారులు ఉన్నట్టు తెలుస్తోంది. గ్రామ సచివాలయాల వద్దా ఉపాధి హామీ పథకం జాబ్ కార్డుల కోసం, పనుల కోసం వెళ్తున్న వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది.