రాష్ట్రంలో 2006 తర్వాత భూ మార్పిడి జరిగి, ‘నాలా’ పన్ను చెల్లించని జాబితాలను అధికారులు సిద్ధం చేస్తున్నారు. అప్పటి నుంచి నాలుగైదు చేతులు మారడంతో.. ఇప్పటి యజమానులు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటివరకు 30వేల మందికి చెందిన 25వేల ఎకరాలను గుర్తించారని, వీటికి రూ.600 కోట్ల వరకు చెల్లించాలని తాజా లెక్కలు చెబుతున్నాయి. ప్రభుత్వం ఖజానా నింపుకోవడమే ధ్యేయంగా పేద, మధ్యతరగతి కుటుంబాలపై పెనుభారం మోపుతోంది. పన్ను చెల్లించనప్పటి విలువ కాకుండా ప్రస్తుత విలువకు 5% నాలా, మరో 5% జరిమానా విధిస్తోంది. దీనివల్ల చెల్లించాల్సిన మొత్తం లక్షల్లోకి చేరుకుంటోందని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భూముల విలువలు పెంచడంతో పేదలు, మధ్యతరగతి వారికి నాలా చెల్లింపు భారంగా మారింది. రెవెన్యూ అధికారులు ప్రతి జిల్లాలో భూముల లెక్కలు తీస్తున్నారు. వంద గజాల్లోపు కట్టుకున్న పేదల ఇళ్లకూ నాలా పన్ను నోటీసులు రావడంతో వారు బెంబేెలెత్తిపోతున్నారు. రామవరప్పాడు పంచాయతీ సర్పంచ్ సైతం ఇటీవల రూ.4.50 లక్షలు చెల్లించారు. విజయవాడ శివార్లలోని పల్లెలన్నింటిలో నోటీసుల జారీ మొదలైంది.
- విజయవాడలోని రామవరప్పాడుకు చెందిన ఆటో డ్రైవర్ ప్రసాద్ 2000 సంవత్సరంలో రామవరప్పాడు వంతెనకు అవతల రూ.3.50 లక్షలతో స్థలం కొని ఇల్లు కట్టుకున్నారు. ఇప్పుడు ఆయనకు రూ.2.50 లక్షల నాలా (వ్యవసాయేతర భూమి) పన్ను చెల్లించాలని నోటీసు వచ్చింది. నిర్మాణ సమయంలోనే చెల్లిస్తానని ప్రసాద్ తిరిగితే రూ.20వేల వరకు ఉంటుందన్నారు గానీ నోటీసివ్వలేదు. అధికారుల జాప్యం వల్ల ఇప్పుడు ఆయన రూ.2.50 లక్షలు కట్టాల్సి వస్తోంది.
- విజయవాడ శివారులోని ఓ దుకాణ యజమానికి ఇటీవల షోకాజ్ నోటీసు ఇచ్చారు. ‘మీ ఆధ్వర్యంలోని 387.20 చదరపు అడుగుల వ్యవసాయ భూమి వ్యవసాయేతరంగా మారింది. చదరపు అడుగుకు రూ.14వేల చొప్పున రూ.2.71 లక్షలు చెల్లించాలి. జరిమానాతో కలిపితే రూ.5.42 లక్షలు ఎందుకు విధించకూడదో వివరణ ఇవ్వండి’ అని అందులో పేర్కొన్నారు.
ప్రతి ఒక్కరూ చెల్లించాల్సిందే..