అడుగడుగునా పోలీసులు.. క్షణక్షణం ఉన్నతాధికారుల పర్యవేక్షణ.. ఇటు గన్నవరం విమానాశ్రయం వద్దా, అటు నరసరావుపేటలోను వందల సంఖ్యలో పోలీసులతో ఎటుచూసినా యుద్ధ వాతావరణం.. సాధారణ ప్రయాణికులకూ నఖశిఖ పర్యంతం తనిఖీలు.. వారి బంధువులు, సన్నిహితులు విమానాశ్రయంలోకి వెళ్లకుండా ఆంక్షలు.. గుంటూరు జిల్లా నరసరావుపేటలో ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన అనూష కుటుంబాన్ని పరామర్శించేందుకు తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్ వెళ్లకుండా పోలీసుల బందోబస్తు ఇది. మొదట గన్నవరం విమానాశ్రయంలోనే లోకేశ్‌ను అడ్డుకొని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించిన పోలీసులు.. వ్యూహం మార్చి ఆయన్ను ఉండవల్లిలోని నివాసానికి తరలించాలని చూశారు. విజయవాడలోని కనకదుర్గ వారధి వద్దకు వచ్చేసరికి తాను ఇంటికి వెళ్లబోనని, నరసరావుపేట వెళతానని లోకేశ్ పట్టుబట్టారు. ఒక దశలో లోకేశ్‌ను బలవంతంగా వాహనంనుంచి దించి స్టేషన్‌కు తరలించేందుకు పోలీసులు ప్రయత్నించడంతో ఉద్రిక్తత ఏర్పడింది. తనను ఎందుకు అడ్డుకుంటున్నారో లిఖితపూర్వకంగా నోటీసునివ్వాలని లోకేశ్ పట్టుబట్టడంతో అక్కడికక్కడ కాగితంపై 41(ఎ) నోటీసు రాసి ఇచ్చారు. ఇదంతా ముగిసేసరికి దాదాపు 2గంటలు పట్టి ట్రాఫిక్‌కు అంతరాయమేర్పడింది. అటు గన్నవరం విమానాశ్రయం వద్ద, ఇటు కనకదుర్గ వారధి వద్ద తెదేపా నేతలను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం అనూష తల్లిదండ్రులకు లోకేశ్ వీడియోకాల్ చేసి మాట్లాడారు. నిందితులను నెలలో శిక్షిస్తామని చెప్పి బెయిలిచ్చి బయటకు పంపారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ‘మరో ఆడబిడ్డకు అన్యాయం జరగకుండా పోరాడతా. అనూష తమ్ముడికి అన్నలా నిలిచి చదువు, ఉద్యోగం బాధ్యత తీసుకుంటా. మీ న్యాయపోరాటానికి అండగా ఉంటా’ అని లోకేశ్ హామీనిచ్చారు.
6 గంటల నుంచే మోహరింపు
లోకేశ్ నరసరావుపేట వెళ్లేందుకు ఉదయం తొమ్మిదింటికి గన్నవరం విమానాశ్రయానికి వస్తారని తెలియడంతో అక్కడే అరెస్టు చేసేందుకు పోలీసులు ఉదయం ఆరింటికే విమానాశ్రయాన్ని దిగ్బంధించారు. నలుగురు ఏసీపీల పర్యవేక్షణలో వందలాది పోలీసుల బందోబస్తుతో పాటు ప్రణాళికలు రూపొందించుకున్నారు. లోకేశ్ ఉదయం 9గంటలకు బదులు 12 గంటలకు విమానాశ్రయానికి చేరుకున్నారు. హైదరాబాద్‌నుంచి ఆయన వెంట మాజీ ఉపముఖ్యమంత్రి చినరాజప్ప, తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు అనిత తదితరులు వచ్చారు. వారు టెర్మినల్ భవనంనుంచి బయటకు రాగానే పోలీసులు అడ్డుకున్నారు. అక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకున్న తెదేపా శ్రేణులు పోలీసులకు వ్యతిరేకంగా నినదించారు. తనను పోలీసులు కదలనీయకపోవడంతో అక్కడే బైఠాయించాలని లోకేశ్ భావించినా పోలీసులు అడ్డుకున్నారు. తాము ఏర్పాటుచేసిన వాహనాల్లో ఎక్కాలని పోలీసులు కోరగా.. నిరాకరించి తన వాహనాన్ని ఎక్కారు. ఒక డీఎస్పీ వారి వాహనంలో ఎక్కారు. లోకేశ్ వాహనశ్రేణిని పోలీసుల కాన్వాయి అనుసరించింది. లోకేశ్‌ను ఉండవల్లిలోని నివాసానికి తీసుకెళ్లి విడిచిపెట్టాలన్నది పోలీసుల వ్యూహం.
కనకదుర్గ వారధి వద్ద హైడ్రామా
కనకదుర్గ వారధి వద్దకు వచ్చేసరికి తనను ఇంటికి తీసుకెళుతున్నారని గ్రహించిన లోకేశ్... నరసరావుపేట వైపు మళ్లించమని తన వాహన డ్రైవర్‌కు సూచించారు. పోలీసులు ఆయన వాహనాన్ని ముందుకు కదలనివ్వలేదు. లోకేశ్‌ను చెయ్యి పట్టుకొని కిందికి దించేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత ఏర్పడింది. కాళ్లు పట్టుకుని లాగేందుకు ప్రయత్నించడంపై లోకేశ్ మండిపడ్డారు. డ్రైవర్‌ను కిందికి దించేందుకు పోలీసుల ప్రయత్నం ఫలించలేదు. అంతలో అక్కడికి చేరుకున్న డీసీసీ హర్షవర్థన్‌రాజు.. నిషిద్ధ ఉత్తర్వులు ఉన్నందున నరసరావుపేటకు వెళ్లేందుకు వీల్లేదని లోకేశ్‌కు చెప్పారు. నోటీసు ఇవ్వకుండా తనను అడ్డుకునేందుకు హక్కులేదని లోకేశ్ స్పష్టం చేశారు. కృష్ణలంక పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లి నోటీసు ఇస్తామని పోలీసులు చెప్పడంతో.. స్టేషన్‌లోనే నోటీసు ఇవ్వాలని ఎక్కడుందని లోకేశ్ ప్రశ్నించారు. చివరకు అక్కడికక్కడ కాగితంపై 41(ఎ) నోటీసు జారీ చేశారు. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి మూడింటివరకు హైడ్రామా నడిచింది. నోటీసు ఇచ్చాక లోకేశ్‌ను పోలీసులు ఆయన ఇంట్లో విడిచిపెట్టారు.