విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో నాన్-కొవిడ్ సేవల ప్రారంభంతో రోగుల రద్దీ గణనీయంగా పెరిగింది. కొత్తగా నిర్మించిన సూపర్‌స్పెషాలిటీ బ్లాక్‌తో కలిపి ఆస్పత్రిలో 840 పడకలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో సగం కొవిడ్ చికిత్స కోసం కేటాయించారు. సూపర్‌స్పెషాలిటీ బ్లాక్ మొత్తాన్ని కొవిడ్ సేవలకు వినియోగిస్తున్నారు. సాధారణ వ్యాధులు, అత్యవసర కేసుల పెరుగుదలతో కొవిడ్ పడకల్ని తగ్గిస్తూ.. ఇతర చికిత్సలకు పెంచుతున్నారు. ఏ బ్లాక్‌లో బ్లాక్ ఫంగస్ బాధితులకు వైద్యం అందిస్తుండగా... బీ, సీ బ్లాకుల్లో పడకల్ని అత్యవసర వైద్యం, శస్త్రచికిత్సలు అవసరమైన సాధారణ రోగులకు కేటాయిస్తున్నారు.
జిల్లాలో రోజూ 300 వరకు కేసులు
ప్రభుత్వాసుపత్రిలోని కొవిడ్ వార్డులో ప్రస్తుతం 200 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరు ఆక్సిజన్ సమస్యతో ఉండగా.. మరికొందరికి ఐసీయూలో వైద్యం అందిస్తున్నారు. జిల్లాలో నిత్యం 200 నుంచి మూడొందల వరకూ కరోనా కేసులు నమోదవుతున్నాయి. వీరిలో 30 నుంచి 40 మంది తీవ్ర లక్షణాలతో ఆస్పత్రిలో చేరుతున్నారు. కొవిడ్ అనుమానిత లక్షణాలతో వచ్చేవారి సంఖ్యా ఎక్కువే ఉంటోందని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం 170 మంది బ్లాక్ ఫంగస్ బాధితులు చికిత్స పొందుతుండగా... నిత్యం 5 నుంచి 6 కేసులు మాత్రమే వస్తున్నాయన్నారు.