రాష్ట్రంలో వివిధ కారణాలతో నిలిచిపోయిన స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల దాఖలుకు శుక్రవారం చివరి రోజు కావడంతో అభ్యర్థులు భారీగా నామినేషన్లు దాఖలు చేశారు. అధికార, ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు మంది మార్బలంతో సందడిగా నామపత్రాలు సమర్పించారు.
కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఘట్టం కోలాహలంగా సాగింది. మున్సిపల్ ఎన్నికల నామినేషన్‌కు శుక్రవారం చివరి రోజు కావడంతో వైకాపా, తేదేపా, జనసేన, భాజపా అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. నూజివీడు మున్సిపల్ 27వ వార్డు ఉప ఎన్నికకు మొత్తం మూడు నామినేషన్లు దాఖలయ్యాయి. కౌన్సిలర్ అభ్యర్థుల వెంట వచ్చే కార్యకర్తలతో కార్యాలయం సందడిగా మారింది. నామినేషన్ ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.
నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ ఎన్నికల నామినేషన్లు సందడిగా సాగాయి. నామినేషన్ల ఆఖరి రోజు అధికార, ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు భారీగా నామినేషన్లు దాఖలు చేశారు. తమ అనుచరగణంతో భారీ ఉరేగింపులు నిర్వహించిన అభ్యర్థులు రిటర్నింగ్ అధికారులకు నామినేషన్ పత్రాలు అందజేశారు. కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి, తెదేపా మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డిలు ఆయా పార్టీల అభ్యర్థులకు మద్దతుగా ఆర్వో కార్యాలయాలకు వచ్చారు. నామినేషన్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ల ఘట్టం చివరి రోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రతి డివిజన్లో వివిధ పార్టీల ర్యాలీలు ఊరేగింపులతో కోలాహలం నెలకొంది. అధికార, ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు మంది మార్బలంతో నామినేషన్లు దాఖలు చేశారు.
అనంతపురం జిల్లా పెనుకొండ నగర పంచాయతీ ఎన్నికలకు ఆఖరి రోజున అన్ని పార్టీలకు సంబంధించి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. తెదేపా తరుపున పోటీ చేస్తున్న 20 మంది వార్డు కౌన్సిలర్లు తేదేపా హిందూపురం పార్లమెంట్ అధ్యక్షుడు బీకే పార్థసారథి ఆధ్వర్యంలో నామినేషన్లు దాఖలు చేశారు. అధికార వైకాపా అభ్యర్థులు రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మంత్రి శంకర్ నారాయణ ఆధ్వర్యంలో నామినేషన్లు దాఖలు చేశారు.